Asia Cup 2022: పాకిస్థాన్ జట్టులో ఆ ముగ్గురు డేంజర్‌గాళ్లు.. రోహిత్ సేన ఒళ్లు దగ్గర పెట్టుకోని ఆడాలి!

హైదరాబాద్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచానికే పూనకం వచ్చేస్తుంది. మ్యాచ్ ఎప్పుడు జరిగినా.. ఎక్కడ జరిగినా ఉత్కంఠంగానే ఉంటుంది. దాయాదుల పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెడుతుంటుంది. ఒక్కో రన్.. అభిమానికి ఊపిరి పోస్తుంది. ఒక్కో బాల్.. ఆటగాడిని నిలువెల్లా వణికించేస్తుంది. ఒక్కో షాట్.. బౌలర్లనూ చేష్టలుడిగేలా చేస్తుంది. బ్యాట్‌కు, బాల్‌కు మధ్య యుద్దంలా సాగే దాయాదుల పోరంటే అభిమానులకే కాదు ఐసీసీకి, క్రికెట్ బోర్డులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అందుకే ఏ ఐసీసీ టోర్నీలోనైనా ఇరు జట్లు తలపడేలా షెడ్యూల్ రూపొందిస్తోంది.

వెంటాడుతున్న ఆ ఓటమి భయం..
ఆగస్టు 27 నుంచి ప్రారంభమయ్యే ఆసియాకప్‌లో భారత్, పాక్ తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి. అయితే దాయాదుల పోరులో విజయం తమదేనని ధీమాగా ఉండే భారత అభిమానులు ఈ సారి కాస్త కలవరపడుతున్నారు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమిని మరిచిపోలేకపోతున్నారు. షాహిన్ షా అఫ్రిది బౌలింగ్ దెబ్బతో పాటు బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ సూపర్ బ్యాటింగ్‌తో భారత్ ఆ మ్యాచ్‌లో 10 వికెట్లతో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే ఈ ముగ్గురు ఆటగాళ్లతో రోహిత్ సేన జాగ్రత్తగా ఉండాలని అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ముగ్గురిని నిలవరించే ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని హితవు పలుకుతున్నారు

షాహిన్ షా అఫ్రిది
పాకిస్థాన్ పేస్ సెన్సేషన్ షాహిన్ షా అఫ్రిది తన అసాధారణమైన బౌలింగ్‌తో ఎంతటి భీకరమైన టాపార్డర్‌ను అయినా కూల్చగలడు. గతేడాది ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను తొలి ఓవర్‌లోనే ఔట్ చేసిన అతను.. కీలక సమయంలో క్రీజులో కుదురుకున్న కోహ్లీని పెవిలియన్ చేర్చి భారత్ పతనాన్ని శాసించాడు. ముఖ్యంగా అతను లెఫ్టార్మ్ పేసర్ కావడం భారత అభిమానులను కలవరపెడుతుంది. భారత బ్యాటర్లకు లెఫ్టార్మ్ పేస్‌ను ఆడటం బలహీనత.
అయితే అఫ్రిదికి భయపడకుండా ఓపికగా ఆడుతూ అటాకింగ్ చేస్తే పరుగులు రాబట్టవచ్చని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఆ జట్టు బ్యాటర్లు అఫ్రిదిపై ఇలానే అటాక్ చేశారు. అఫ్రిది వేసే బంతిని శరీరానికి, ప్యాడ్లకు కాకుండా బ్యాట్‌తో ఆడాలని, అప్పుడు అతని బౌలింగ్‌ను చెడుగుడు ఆడవచ్చని పాక్ మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

మహమ్మద్ రిజ్వాన్
బ్యాటింగ్‌లో మహమ్మద్ రిజ్వాన్ అత్యంత ప్రమాదకరం. టాపార్డర్‌లో ఆడే రిజ్వాన్.. తనదైన షాట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడతాడు. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది ప్రపంచకప్‌లో పాక్ సెమీ ఫైనల్ చేరడంలో రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. గతేడాది టీ20 క్రికెట్‌లో 26 ఇన్నింగ్స్‌లు ఆడిన రిజ్వాన్.. 73.66 సగటుతో 1326 పరుగులు చేశాడు. అయితే రిజ్వాన్‌పై పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ ఆధారపడటం ఇక్కడ భారత్‌కు కలిసొచ్చే అంశం. అతను క్రీజులో కుదురుకోకముందే ఔట్ చేస్తే పాక్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలుతుంది. కానీ రిజ్వాన్ అంత తేలిగ్గా వికెట్ సమర్పించుకోడు. కాబట్టి అతన్ని త్వరగా ఔట్ చేయడంపై భారత్ స్పెషల్ ఫోకస్ పెట్టాలి.

బాబర్ ఆజామ్..
పాకిస్థాన్ కోహ్లీగా అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్న బాబర్ ఆజామ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఆరంభంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తనదైన ప్రదర్శనతో అందరి నోళ్లు మూయించాడు. టీ20 ఫార్మాట్‌లో నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న బాబర్ ఆజామ్.. గత రెండేళ్లుగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బాబర్ క్రీజులో పాతుకుపోతే అతన్ని ఔట్ చేయడం చాలా కష్టం. కాబట్టి వీలైనంత త్వరగా అతన్ని ఔట్ చేసే ప్రయత్నం భారత్ చేయాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications