
ముంబై: టీమిండియా సీనియర్ పేసర్ అశోక్ దిండా మంగళవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతన్నట్లు తెలిపాడు. తన కెరీర్‌కు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. భారత్ తరఫున 13 వన్డేలు, 9 టీ20లు ఆడిన దిండా..12, 17 చొప్పున మొత్తం 29 వికెట్లు తీశాడు.2009లో శ్రీలంకపై నాగ్‌పూర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దిండా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే (1/34) ఆకట్టుకున్నాడు. సనత్ జయసూర్య అతని ఫస్ట్ ఇంటర్నేషనల్ వికెట్.
ఇంగ్లండ్‌తో 2013లో జరిగిన వన్డే అతని కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. అందులో ఈ బెంగాల్ క్రికెటర్ (2/53) రాణించాడు. కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్‌లను ఔట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆకట్టుకోలేకపోయినా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం దిండా అద్భుతంగా రాణించాడు. బెంగల్ తరఫున దశాబ్దకాలం ఆడిన అశోక్ దిండా.. 116 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో 420 వికెట్ల పడగొట్టాడు. ఇందులో 26 సార్లు ఐదు వికెట్ల ఘనతను, 5 సార్లు 10 వికెట్ల హాల్స్ అందుకున్నాడు. ఫలితంగా బెంగల్ తరఫు సెకండ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పుణే వారియర్స్, రైజింగ్ పుణే సూపర్ గేయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తం 78 మ్యాచ్‌లు ఆడిన ఈ వెటరన్ క్రికెటర్ 68 వికెట్లు పడగొట్టాడు. అయితే 2019-20 రంజీ సీజన్‌లో కేవలం ఒకే మ్యాచ్ ఆడిన దిండా.. ఆ తర్వాత ఆ జట్టు కోచ్‌తో తలెత్తిన విభేదాలతో తప్పుకున్నాడు. అనంతరం గోవాకు మారిన దిండా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు కూడా ఆడాడు.
ఇక 2013 వరకు గొప్పగా సాగిన అతని కెరీర్ క్రిస్ గేల్ పుణ్యమా భవిష్యత్తు లేకుండా పోయింది. అదే ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో అప్పటి ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ దిండా బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ఆ మ్యాచ్‌లో ఈ విండీస్ వీరుడి ధాటికి దిండా ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఏ బౌలర్ ఎక్కువ పరుగులిచ్చినా.. ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకపోయినా దిండా అకాడమీ, క్లబ్‌లోకి స్వాగతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు.