
కోహ్లీ 250 పరుగులు సాధిస్తాడు
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. టాస్ ఎంతో కీలకమని, అయితే ఇంగ్లండ్ ప్రదర్శనను తక్కువ చేయట్లేదని పేర్కొన్నాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు 578 పరుగులు చేసింది. ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీ బాదాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా కోహ్లీ సెంచరీ సాధించిలేదని వస్తున్న విమర్శలపై ఆశిష్ నెహ్రా స్పందించాడు. 'మీరందరూ ఒకటి లేదా రెండు సెంచరీల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. రెండో టెస్టులో భారత్ టాస్ గెలిస్తే.. కోహ్లీ 250 పరుగులు సాధిస్తాడు. విరాట్‌కు ఉన్న ప్రత్యేకత అదే' అని అన్నాడు.

పరుగులకు గౌరవం ఇస్తుంటాడు
'ఐదవ రోజు రవిచంద్రన్ అశ్విన్ ఔటైనప్పుడు మ్యాచ్ ఓడిపోతున్నామనే విషయం విరాట్ కోహ్లీకి తెలుసు. కానీ ఆ తర్వాత కూడా అతడు ఎడాపెడా షాట్లేమి ఆడలేదు. ఎప్పటిలానే బ్యాటింగ్ చేశాడు. చేస్తున్న పరుగులకు అతడు గౌరవం ఇస్తుంటాడు. అందుకే కోహ్లీ త్వరగా ఔటవ్వలేదు. అయితే విరాట్ ఔటైన బంతికి ఏ బ్యాట్స్‌మెన్ అయినా వెనుదిరుగుతాడు. బంతి చాలా తక్కువ ఎత్తులో వచ్చింది' అని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. నెహ్రా 17 టెస్టుల్లో 44 వికెట్లు పడగొట్టాడు. నాలుగు వికెట్ల ప్రదర్శన రెండుసార్లు చేశాడు.

అందుకే భిన్నంగా నిలుస్తున్నాడు
'ఉపఖండ పిచ్‌లో నాలుగు, ఐదు రోజుల్లో ఎలా ఆడాలని కోరుకుంటారో విరాట్ కోహ్లీ అలానే ఆడాడు. ఇతర ఆటగాళ్ల కంటే కోహ్లీ అందుకే భిన్నంగా నిలుస్తున్నాడు. ఇక్కడే కాదు, ఇంగ్లండ్‌లో అతడు పరుగులు చేయలేని పరిస్థితుల్లోనూ డిఫెన్సివ్‌తో బ్యాటింగ్ చేస్తూ క్రీజులో నిలిచాడు. అలా చేయడానికి ఎంతో ఫిట్‌నెస్ అవసరం' అని నెహ్రా చెప్పుకొచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా టీమిండియాను గట్టెంకించలేకపోయాడు. ఇక నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగానే రెండో టెస్టు ప్రారంభం కానుంది.

వరుసగా నాలుగు టెస్టుల్లో ఓటమి
తొలి టెస్ట్ ఓటమితో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. గత ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన టెస్టులలో భారత్ ఓడిపోయింది. డిసెంబర్‌లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్-బాల్ టెస్టులో భారత్ ఓడిపోగా.. చెన్నై వేదికగా ముగిసిన తొలి టెస్టులో పరాజయాన్ని చవిచూసింది. కోహ్లీ కెప్టెన్సీలో వరుసగా నాలుగు టెస్టుల్లో భారత్ ఓటములు చవిచూడటం ఇదే ప్రథమం. అంతకుముందు అతడు వరుసగా ఏడు టెస్టుల్లో విజయాలు అందుకున్నాడు.
India vs England: వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడడం ఇదే తొలిసారి.. కోహ్లీ ఏంటిది?


Click it and Unblock the Notifications












