మాంచెస్టర్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో విజయం దిశగా దూసుకెళ్తున్న ఇంగ్లండ్‌ను వరణుడు వణికిస్తున్నాడు. వర్షం అంతరాయం కారణంగా నాలుగో రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికే తొలి సెషన్ ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
వర్షం ఆగిపోయినా.. ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆట ఇంకా ప్రారంభం కాలేదు. ఒకవేళ ఈ రోజు ఆట సాధ్యం కాకపోతే ఆసీస్.. డ్రా కోసం ప్రయత్నించే అవకాశాలుంటాయి. చివరి రోజు కూడా ఒక సెషన్ జరగకపోతే మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసే అవకాశం ఉంది.

ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ మార్ష్(51), మార్నస్ లబుషేన్(51) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. క్రిస్ వోక్స్(5/62) ఐదు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. స్టువర్డ్ బ్రాడ్ రెండు, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్, మొయిన్ అలీ తలో వికెట్ తీసారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. బజ్‌బాల్ బ్యాటింగ్‌తో 592 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాక్ క్రాలీ(189) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. జానీ బెయిర్ స్టో(99 నాటౌట్) సెంచరీ మిస్ చేసుకున్నాడు. జోరూట్(84), హ్యారీ బ్రూక్(61), బెన్ స్టోక్స్(51), మొయిన్ అలీ(54) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆసీస్ బౌలర్లలో హజెల్ వుడ్(5/126) ఐదు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్యాట్ కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది. 275 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 113/4తో నిలిచింది.
ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(18), డేవిడ్ వార్నర్(28)లతో పాటు స్టీవ్ స్మిత్(17), ట్రావిస్ హెడ్(1) విఫలమవ్వగా.. మార్నస్ లబుషేన్(44 బ్యాటింగ్), మిచెల్ మార్ష్(1 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించారు. ఆసీస్ ఇంకా 162 పరుగులు వెనుకంజలో ఉండగా.. చివరి 6 వికెట్లు తీసి విజయాన్ని అందుకోవాలని భావించిన ఇంగ్లండ్ ఆశలపై వరణుడు నీళ్లు జల్లుతున్నాడు.