ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో డీఆర్‌ఎస్ విషయంలో తీవ్ర దుమారం రేగింది. సాంకేతిక లోపం కారణంగా ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అతను ఏకంగా శతకంతో చెలరేగాడు. ఇది ఇంగ్లండ్ జట్టుకు తీవ్ర నష్టం చేసింది.
అలెక్స్ క్యారీ సెంచరీతో తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది. మొదటి రోజు ఆట అనంతరం అలెక్స్ క్యారీ డీఆర్‌ఎస్ వివాదాంపై స్పందించాడు. తాను ఔటయ్యాననే విషయం తెలుసని, అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో బ్యాటింగ్ కొనసాగించి సెంచరీ సాధించానని చెప్పాడు. ఈ వ్యాఖ్యలు మరింత అగ్గిని రాజేసాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీతో కలిసి ఉస్మాన్ ఖవాజా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే జోష్ టంగ్ వేసిన 63వ ఓవర్ తొలి బంతి అలెక్స్ క్యారీ బ్యాట్‌ను తాకుతూ వికెట్ కీపర్ చేతిలో పడింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.

బ్యాట్‌ను బంతి తాకిన శబ్దం స్పష్టంగా వినిపించింది. దాంతో ఇంగ్లండ్ రివ్యూకి వెళ్లింది. కానీ స్నీకో మీటర్ టెక్నాలజీలో బంతి బ్యాట్‌ను తాకినట్లు తేలలేదు. బంతి బ్యాట్‌కు దూరంగా ఉన్నప్పుడు స్నీకో మీటర్‌లో గీత వచ్చింది. దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి మార్క్ చూపించలేదు. రిప్లేతో పాటు స్నీకో మీటర్‌లో స్పష్టత లేకపోవడంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాటౌట్ ఇచ్చాడు.
అయితే టెక్నాలజీ లోపం కారణంగానే ఈ తప్పిదం జరిగిందని తొలి రోజు ఆట అనంతరం తేలింది. ఈ మ్యాచ్ టెక్నాలజీ విభాగాన్ని నిర్వహిస్తున్న బీబీజీ స్పోర్ట్స్ కంపెనీ తమ తప్పుకు క్షమాపణలు చెప్పింది. 'అలెక్స్ క్యారీ బ్యాట్‌కు బంతి తగిలింది వాస్తవమే. ఆ సమయంలో మా స్నికో ఆపరేటర్ పొరపాటున బ్యాట్స్‌మన్ వైపు ఉన్న స్టంప్ మైక్‌ను కాకుండా బౌలర్ వైపు ఉన్న మైక్‌ను ఎంచుకున్నాడు. దాంతో ఆడియోలో లోపడం ఏర్పడింది. ఈ తప్పిదానికి మేం బాధ్యత వహిస్తాం.'అని స్పష్టం చేసింది.
అలెక్స్ క్యారీ(143 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 106) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 83 ఓవర్లలో 8 వికెట్లకు 326 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(126 బంతుల్లో 10 ఫోర్లతో 82) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రీజులో మిచెల్ స్టార్క్(33 బ్యాటింగ్)తో పాటు నాథన్ లయన్(0 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3/29) మూడు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, విల్ జాక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జోష్ టంగ్‌కు ఓ వికెట్ దక్కింది.