టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. యాషెస్ సిరీస్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో ఆ జట్టు 134 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 1892లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు 50+ భాగస్వామ్యాలను నమోదు చేసింది. ఈ రికార్డ్‌ను ఇప్పుడు ఆసీస్ అధిగమించింది.
యాషెస్ సిరీస్ 2025 26లో భాగంగా సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 133.5 ఓవర్లలో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్(166 బంతుల్లో 24 ఫోర్లు, సిక్స్‌తో 163), కెప్టెన్ స్టీవ్ స్మిత్(220 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 138 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు.

ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ తొలి వికెట్‌కు 57 పరుగులు, రెండో వికెట్‌కు 105, మూడో వికెట్‌కు 72, నాలుగో వికెట్‌కు 54, ఐదో వికెట్‌కు 51, ఏడో వికెట్‌కు 71, 8వ వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. యాషెస్ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో ఇలా ఏడు 50 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు కావడం ఇదే తొలిసారి.
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక 50+ భాగస్వామ్యాలు నమోదు చేసిన రికార్డ్ భారత్ పేరిట ఉంది. 2007లో భారత్ ఒకే ఇన్నింగ్స్ ఎనిమిది 50+ భాగస్వామ్యాలు నమోదు చేసి ఈ ఘనతను అందుకుంది. 2007లో ఇంగ్లండ్‌తో ది ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు ఈ వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లోనే అనిల్ కుంబ్లే తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. అప్పటి నుంచి ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉంది. తాజాగా ఆసీస్ ఈ ఫీట్ సాధించి రెండో స్థానంలో నిలిచింది.
ఈ ఆఖరి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమి ముంగిట నిలిచింది. 184 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 8 వికెట్లకు 302 పరుగులు చేసింది. క్రీజులో జాకోబ్ బెతెల్(232 బంతుల్లో 15 ఫోర్లతో 142 నాటౌట్)తో పాటు మాథ్యూ పాట్స్(0 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 119 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆఖరి రోజు ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్ చేస్తే ఆస్ట్రేలియాకు భారీ విజయం దక్కనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గట్టెక్కాలంటే ఆఖరి రోజంతా బ్యాటింగ్ చేయాలి. సెంచరీ హీరో జాకోబ్ బెతెల్‌పైనే ఆ జట్టు ఆశలు పెట్టుకుంది.