బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర ప్రశంసల జల్లు కురిపించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బెన్ స్టోక్స్ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని కొనియాడాడు. ముఖ్యంగా అతని ఫీల్డ్ సెటప్ అమోఘమని ప్రశంసించాడు.
అయితే ఈ తరహా ఫీల్డ్ సెటప్ ధోనీ ఎక్కువగా ఉపయోగిస్తాడని, బహుషా అతని దగ్గర నుంచే బెన్ స్టోక్స్ నేర్చుకున్నట్లున్నాడని సంగక్కర అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగక్కర చివరి రోజు ఆటలో ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేస్తుండగా.. బెన్ స్టోక్స్ పెట్టిన ఫీల్డ్ సెటప్‌ను వివరిస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఇలా స్ట్రైట్‌గా బౌలర్ పక్కనే ఫీల్డర్‌ను ధోనీ ఎక్కువగా పెడుతాడని గుర్తు చేశాడు. ఐపీఎల్‌లో కీరన్ పోలార్డ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ధోనీ ఇలా ఫీల్డర్‌ను పెట్టేవాడని చెప్పాడు. సీఎస్‌కేకు ఆడుతున్న బెన్ స్టోక్స్.. ధోనీ కెప్టెన్సీని దగ్గరగా చూసి ఇది నేర్చుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.
ఇక ఇదే టెస్ట్‌లో స్టీవ్ స్మిత్‌కు స్లిప్‌లో నలుగురు ఫీల్డర్లు, లెగ్ స్లిప్ మరో ఇద్దరిని, షార్ట్ లెగ్‌లో ఓ ఫీల్డర్‌ను పెట్టి స్టోక్స్ వికెట్ సాధించిన విషయం తెలిసిందే. స్మిత్‌ను ఒత్తిడికి గురి చేసి వికెట్ రాబట్టడంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది.
మూడో రోజు ఆటలో సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజాను కూడా ఇదే తరహా ఫీల్డింగ్‌తో స్టోక్స్ పెవిలియన్ చేర్చాడు. ఆన్‌డ్రైవ్, కవర్ డ్రైవ్ షాట్స్ ఎక్కువగా ఆడుతున్న ఉస్మాన్ ఖవాజాకు 30 యార్డ్ సర్కిల్‌లోనే ఆరుగురు ఫీల్డర్లను క్యాచింగ్ పొజిషన్‌లో పెట్టి ఒత్తిడికి గురి చేశాడు. ఖవాజా షాట్ ఆడే ప్రాంతాల్లో స్టోక్స్ ఫీల్డ్ సెట్ చేయడంతో అతను గందరగోళానికి గురయ్యాడు.
దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ఖవాజా స్టెప్ ఔటై భారీ షాట్ ఆడబోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ రెండు వికెట్లకు సంబంధించిన ఫీల్డ్ సెటప్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిని కూడా సంగక్కర కొనియాడాడు. ఇది అద్భుతమైన కెప్టెన్సీ అంటూ బెన్ స్టోక్స్‌ను మెచ్చుకున్నాడు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్ చివరి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమవ్వగా.. ఇరు జట్లు విజయం కోసం పోరాడుతున్నాయి. 281 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా 107/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్(17 బ్యాటింగ్) కలిసి ఉస్మాన్ ఖవాజా(51 నాటౌట్) పోరాడుతున్నాడు. ఆసీస్ విజయానికి ఇంకా 109 పరుగుల అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు ఐదు వికెట్లు కావాలి.
సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 393/8 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 386 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 273 ఆలౌట్