లార్డ్స్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లార్ట్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే అనూహ్యంగా మైదానంలోకి నిరసనకారులు దూసుకొచ్చారు.
'జస్ట్ స్టాప్ ఆయిల్' ప్లకార్డులతో గట్టిగా అరుస్తూ ఆటను అడ్డుకున్నారు. ఆరెంజ్ పౌడర్ పెయింట్‌ను మైదానంలో చల్లారు. నిరసనకారుల్లోని ఒకర్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో ఎత్తి పడేసాడు. చంకలో ఎత్తుకొని మైదానం బయటకు లాగిపడేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. బెయిర్ స్టో సాహాసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

సాధారణంగా నిరసనకారులను అడ్డుకునేందుకు ఆటగాళ్లు భయపడతారు. తోపులాటలో గాయపడే అవకాశాలుంటాయని దూరంగా ఉంటారు. కానీ బెయిర్ స్టో ఆయిల్ నిరసనకారులను ధైర్యంగా అడ్డుకున్నాడు.
'జస్ట్ స్టాప్ ఆయిల్' అనేది పర్యావరణ రక్షణ కోసం ఉద్యమిస్తున్న గ్రూప్. 2022 నుంచి పర్యావరణ రక్షణ కోసం ఈ గ్రూప్ ఉద్యమిస్తోంది. ఇంగ్లండ్‌లో ఇంధన సంస్థలకు అడ్డగోలుగా లైసెన్స్‌లు ఇవ్వడాన్ని ఈ గ్రూప్ వ్యతిరేకిస్తోంది.
అంతేగాకుండా 2025 నాటికి కొత్తగా మరో 100కి పైగా ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులను తీసుకురావాలని యూకీ ప్రభత్వం నిర్ణయించడాన్ని జస్ట్ స్టాప్ అయిల్ గ్రూప్ వ్యతిరేకిస్తోంది.
విచ్చలవిడిగా ఆయిల్ కంపెనీలకు అనుమతులివ్వడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆయిల్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటు విషయంలో యూకే ప్రభుత్వం వెనక్కి తగ్గాలనే లక్ష్యంతో ఈ గ్రూప్ పోరాటం చేస్తోంది.
అంతర్జాతీయంగా తమ ఉద్యమాన్ని తెలియజేసేందుకే నిరసనకారులు యాషెస్ రెండో టెస్ట్‌ను తమ వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై నిరసనకారులను అదుపులోకి తీసుకోవడం ఆట తిరిగి ప్రారంభమైంది. వర్షం కాసేపు అంతరాయం కలిగించినా.. మళ్లీ ఆట మొదలైంది.
బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. వార్నర్ 66 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 22 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసింది.