లీడ్స్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు కుప్పకూలింది. మార్క్‌వుడ్ చెలరేగడంతో 85 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మిచెల్ మార్ష్(118 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 118) ఆదుకున్నాడు.
ట్రావిస్ హెడ్(74 బంతుల్లో 5 ఫోర్లతో 39)తో కలిసి ఐదో వికెట్‌కు 155 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీని క్రిస్ వోక్స్ పెవిలియన్ చేర్చాడు. ముందుగా మిచెల్ మార్ష్‌ను క్యాచ్ ఔట్ చేసిన వోక్స్.. ట్రావిస్ హెడ్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. స్లిప్‌లో ట్రావిస్ హెడ్ క్యాచ్‌ను అందుకున్న జోరూట్ కోపంతో ఊగిపోయాడు.

తన శైలికి భిన్నంగా బంతిని నేలకు కొట్టి గట్టిగా అరిచాడు. ప్రస్తుతం అతని కోపానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా జోరూట్ ప్రశాంతంగా ఉంటాడు. తన భావోద్వేగాలను అస్సలు ప్రదర్శించడు. అలాంటి జోరూట్ ఆగ్రహానికి గురవ్వడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జోరూట్ ఎందుకంత కోపం అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే అప్పటికే రెండు సునాయస క్యాచ్‌లను జోరూట్ నేలపాలు చేశాడు. మిచెల్ మార్ష్, అలెక్స్ క్యాచ్ ఇచ్చిన క్యాచ్‌లను అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ క్యాచ్ అందుకోగానే గట్టిగా అరుస్తూ బంతిని నేలకు కొట్టాడని ఇంగ్లండ్ టీమ్ వర్గాలు వెల్లడించాయి.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి 3 వికెట్లకు 68 పరుగులు చేసింది. క్రీజులో జోరూట్(19 బ్యాటింగ్), జానీ బెయిర్ స్టో(1 బ్యాటింగ్) ఉన్నారు. జాక్ క్రాలీ(33) పర్వాలేదనిపించినా.. బెన్ డక్కెట్(2), హ్యారీ బ్రూక్(3) తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ ఇంకా 195 పరుగుల వెనుకంజలో ఉంది.
లార్డ్స్ టెస్ట్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో జానీ బెయిర్ స్టో స్టంపౌట్‌పై వివాదం చెలరేగడంతో ఇరు జట్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆసీస్ ఆటగాళ్లు ఛీటర్స్ అంటూ ఇంగ్లండ్ ఫ్యాన్స్‌ను ఎగతాళి చేస్తూ ఉంటే.. వాళ్లు ఆటతో సమాధానం చెబుతున్నారు. దాంతో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతున్నారు.