బర్మింగ్‌హామ్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్(82 బ్యాటింగ్) దుమ్మురేపుతున్నాడు. బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తన శైలికి భిన్నంగా ధాటిగా ఆడుతూ బౌండరీల మోత మోగిస్తున్నాడు.
ముఖ్యంగా స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో జోరూట్ కొట్టిన రివర్స్ స్కూప్ షాట్.. ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. సాధారణంగా టీ20 క్రికెట్‌లో రివర్స్ స్కూప్, స్వీప్ షాట్లు ఎక్కువగా చూస్తుంటాం. అది కూడా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగేందుకు బ్యాటర్లు రివర్స్ స్వీప్, స్వీప్, స్కూప్ షాట్లు ఆడుతుంటారు. కానీ పేస్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ ఆడటం చాలా అరుదు.

జోరూట్ మాత్రం చాకచక్యంగా రివర్స్ స్కూప్ షాట్ ఆడి సిక్సర్ రాబట్టాడు. స్కాట్ బోలాండ్ వేసిన 53వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని బోలాండ్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. జోరూట్ రివర్స్ స్కూప్ షాట్ సాయంతో సిక్సర్‌గా మలిచాడు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
జోరూట్ షాట్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్.. ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. జో రూట్‌లో ఈయాంగిల్ కూడా ఉందా? అని కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం బజ్‌బాల్ కాన్సెప్ట్‌కు జో రూట్ కూడా అలవాటు పడ్డాడని మరికొందరు కామెంట్ చేశారు. భారత అభిమానులు అయితే స్కాట్ బోలాండ్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. 'ఓరి బోలాండూ.. టీమిండియా ముందేరా నీ ఏశాలు'అని సెటైర్లు పేల్చారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఔటాఫ్ సిలబస్‌గా బరిలోకి దిగిన స్కాట్ బోలాండ్.. భారత బ్యాటింగ్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. కీలక వికెట్లు తీసి భారత ఓటమిని శాసించాడు. ఈ ప్రదర్శనతోనే మిచెల్ స్టార్క్‌ను పక్కనపెట్టి మరీ బోలాండ్‌ను ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌ను ఆసీస్ ఆడిస్తోంది. అయితే ఇంగ్లండ్ బజ్‌బాల్ కాన్సెప్ట్‌కు బోలాండ్ తేలిపోయాడు.
ఇప్పటివరకు 14 ఓవర్లు వేసిన బోలాండ్ ఒకే ఒక వికెట్ తీసి 86 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఓ దశలో 176 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జోరూట్, జానీ బెయిర్ స్టో విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. వన్డే తరహా బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగెత్తించారు.
ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించిన అనంతరం జానీ బెయిర్ స్టో(78 బంతుల్లో 12 ఫోర్లతో 78) ఔటవ్వగా.. టెస్ట్ ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన మొయిన్ అలీ(18) నిరాశపరిచాడు. క్రీజులోకి వచ్చిన స్టువర్ట్ బ్రాడ్(8) సాయంతో జోరూట్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.