Ashes 2023: అందుకే గజిబిజిగా ఇంగ్లండ్ ఆటగాళ్ల జెర్సీలు!
లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. అయితే మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్ల జెర్సీలను చూసి అభిమానులతో పాటు కామెంటేటర్లు షాక్ అయ్యారు. ఒకరి జెర్సీలపై మరొకరి పేరు ఉండటం చూసి అవాక్కయ్యారు. ఏ ఒక్కరో ఇద్దరో కాకుండా జట్టు మొత్తం ఇలా గజిబిజిగా జెర్సీలను ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కగా.. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
జెర్సీలు తయారు చేసిన కంపెనీ తప్పిదమేమో.. ఒకరి కొలతలతో కుట్టి మరొకరి పేరు ముద్రించారేమోనని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చారు. పేసర్ జేమ్స్ అండర్సన్.. మరో ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ పేరుతో ఉన్న జెర్సీలో కన్పించాడు. ఇక జానీ బెయిర్‌స్టో.. బెన్‌స్టోక్ జెర్సీ వేసుకున్నాడు. మొయిన్ అలీ.. క్రిస్ వోక్స్ పేరున్న జెర్సీ ధరించాడు. ఇలా మిగతా ఆటగాళ్లు కూడా తమ పేరుతో ఉన్నవి కాకుండా జట్టులో ఇతర ఆటగాళ్ల జెర్సీలు వేసుకున్నారు.

అయితే దీని వెనుక అందరి మనస్సులను కదలించే కారణముంది. డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్న వారికి మద్దతుగా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలా గజిబిజీగా జెర్సీలు వేసుకున్నట్లు ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్‌కోథిక్ తెలిపాడు. అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించాడు.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, అల్జీమర్స్ సొసైటీ సంయుక్తంగా చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆటగాళ్లు గజిబిజీగా జెర్సీలు ధరించారని చెప్పాడు. 'అల్జీమర్స్ అనేది చాలా భయంకరమైన సమస్య. ఈ వ్యాధితో బాధపడేవారికి జ్ఞాపకశక్తి ఉండకపోవడంతో తరచూ గందరగోళానికి గురవుతారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఆటగాళ్లు ఇలా జెర్సీలను మార్చుకున్నారు.
విరాళాలు కూడా సేకరిస్తున్నాం. మా ప్రయత్నంతో మరింత మందికి ఈ వ్యాధి గురించి అవగాహన వస్తుందని ఆశిస్తున్నాం'' అని మార్కస్ ట్రెస్‌కోథిక్ తెలిపాడు. కాగా.. ఈ ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ తండ్రి మార్టిన్ కూడా ఇదే డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆ జట్టు 362 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ 295 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 77 ఓవర్లలో 7 వికెట్లకు 375 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications