లార్డ్స్: ప్రపంచ క్రికెట్‌లో తమదైన ఆటతో ఆధిపత్యం చెలాయిస్తున్న ఆస్ట్రేలియా.. ఛీటర్స్ అనే ట్యాగ్‌ను మాత్రం తొలిగించుకోలేకపోతుంది. విజయం కోసం అడ్డదారులు తొక్కడం, స్లెడ్జింగ్ పేరిట ప్రత్యర్థులపై మాటల దాడి చేయడం, మైదానంలో ఛీటింగ్‌కు పాల్పడటం కంగారులకు వెన్నతో పెట్టిన విద్య అనే అపవాదు ఏళ్ల తరబడి ఆ జట్టుకు ఉంది.
బాల్‌ట్యాంపరింగ్ ఉదంతంతో ప్రపంచ క్రికెట్ ముందు దోషులుగా నిలబడ్డ ఆసీస్.. ఆ ఘటన తర్వాత స్లెడ్జింగ్ విషయంలో కాస్త తగ్గినా.. ఛీటర్స్ అనే ముద్రను తొలగించుకోలేకపోతుంది. జెంటిల్‌మెన్ గేమ్‌లో నిజాయితీగా వ్యవహరించడం లేదనే విమర్శలను తరుచూ ఎదుర్కొంటుంది. తమ మోసపూరితమైన ఆటతో టెక్నాలజీతో పాటు అంపైర్లను తప్పుదోవ పట్టిస్తోందనే ఆరోపణలతో అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది.

భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో శుభ్‌మన్ గిల్ ఇచ్చిన స్లిప్ క్యాచ్‌ను కామెరూన్ గ్రీన్ అందుకోగా.. ఈ వికెట్ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది. బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ ఔటివ్వడం వివాదాస్పదమైంది. తాజాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.
జట్టు స్కోరు 222 వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ అందుకున్న డైవింగ్ క్యాచ్‌కు జో రూట్ నిష్క్రమించాడు. అయితే బంతి పూర్తిగా అతడి చేతిలో లేకపోయినా థర్డ్ అంపైర్ రూట్ ఔటని ప్రకటించడం వివాదాస్పదమైంది. మిచెల్ స్టార్క్ వేసిన 46వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ఓవర్ మూడో బంతిని స్టోక్స్ షార్ట్ పిచ్ డెలివరీగా వేయగా.. జోరూట్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి గాల్లోకి లేచి బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా దూసుకెళ్లగా.. స్మిత్ సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. బంతిని అందుకునే క్రమంలో నేలకు తాకినట్లు రిప్లేలో స్పష్టమైంది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బంతి కింద స్మిత్ వెళ్లు ఉన్నాయని చెబుతూ ఔటిచ్చాడు.
ఈ వికెట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ మరోసారి ఛీటింగ్ చేసిందని మండిపడుతున్నారు. అంత క్లియర్‌గా బంతి నేలకు తాకితే ఔట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. బెన్ డకెట్(134 బంతుల్లో 9 ఫోర్లతో 98) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. జాక్ క్రాలీ(48), ఓలీ పోప్(42) విలువైన పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హ్యారీ బ్రూక్(45 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(17 బ్యాటింగ్) ఉన్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న ఇంగ్లండ్.. ఇంకా 138 పరుగులు వెనుకడి ఉంది.
అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(184 బంతుల్లో 15 ఫోర్లతో 110) సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(73 బంతుల్లో 14 ఫోర్లతో 77), డేవిడ్ వార్నర్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. జోరూట్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తలో వికెట్ తీసారు.
ఈ వీడియోలో 12:47 నిమిషం నుంచి స్మిత్ పట్టిన క్యాచ్ చూడవచ్చు: