లార్డ్స్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ చేసిన ఓ పనిని చూసి నెటిజన్లు యాక్ తూ.. అంటున్నారు. ఛీ.. ఛీ ఇదేం పనంటూ అసహించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇంతకేం జరిగిందంటే.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా బ్యాటింగ్ చేసే క్రమంలో మార్నస్ లబుషేన్ నోట్లోని చూయింగమ్ కిందపడిపోయింది. వెంటనే అతను దాన్ని వదిలేయకుండా.. తీసి మళ్లీ నోట్లో వేసుకున్నాడు. ఇది టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

ఆసీస్ ఇన్నింగ్స్ 45వ ఓవర్‌కు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. స్ట్రైకింగ్ అతనిదే కావడంతో గ్లోవ్స్‌తో పాటు హెల్మెట్ పెట్టుకునే క్రమంలో చూయింగమ్ కిందపడగా.. మార్నస్ లబుషేన్ దాన్ని తీసుకొని నోట్లో వేసుకున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఛీ.. యాక్ తూ అని కొందరంటే.. అంత కక్కుర్తి ఏందిరా? అంటూ మరొకరు ప్రశ్నిస్తున్నారు.
ఇంకొందరు మాత్రం అందరూ చేసే పని ఇదేనని, పైకి సుద్ద పూస మాటలు మాట్లాడుతారని అతనికి అండగా నిలుస్తున్నారు. పిచ్ టేస్ట్ చూసేందుకు లబుషేన్ అలా చేశాడని మరికొందరు సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలి టెస్ట్ మాదిరి మ్యాచ్‌పై పట్టు కోసం ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్.. తగ్గేదేలే అన్నట్లు ఊర మాస్ బ్యాటింగ్‌తో చెలరేగుతోంది. బజ్‌బాల్ వ్యూహంతో తొలి టెస్ట్‌లో ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా.. ఇంగ్లండ్ దూకుడు విషయంలో తగ్గేదేలే అంటోంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. బెన్ డకెట్(134 బంతుల్లో 9 ఫోర్లతో 98) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. జాక్ క్రాలీ(48), ఓలీ పోప్(42) విలువైన పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హ్యారీ బ్రూక్(45 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(17 బ్యాటింగ్) ఉన్నారు.

చేతిలో 6 వికెట్లు ఉన్న ఇంగ్లండ్.. ఇంకా 138 పరుగులు వెనుకడి ఉంది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(184 బంతుల్లో 15 ఫోర్లతో 110) సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(73 బంతుల్లో 14 ఫోర్లతో 77), డేవిడ్ వార్నర్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. జోరూట్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తలో వికెట్ తీసారు.