బర్మింగ్‌హామ్: ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి రోజు బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో బ్యాటింగ్‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్.. రెండో రోజు బౌలింగ్‌లో సత్తా చాటింది. నాలుగు కీలక వికెట్లు తీసి ఆసీస్‌పై ఆధిపత్యం చెలాయిస్తోంది. మరోవైపు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అసాధారణ పోరాటంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే స్టీవ్ స్మిత్ క్రీజులోకి రాగానే బెన్ స్టోక్స్ పెట్టిన ఫీల్డ్ సెటప్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. 4/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు కొనసాగించిన ఆసీస్‌కు స్టువర్ట్ బ్రాడ్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. వరుస బంతుల్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్(9), మార్నస్ లబుషేన్‌లను పెవిలియన్ చేర్చాడు.

డేవిడ్ వార్నర్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 18వ సారి ఔట్ చేసిన బ్రాడ్.. మార్నస్ లబుషేన్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. ఆ వెంటనే స్టీవ్ స్మిత్ క్రీజులోకి రాగా.. బెన్ స్టోక్స్ ఆసక్తికర ఫీల్డ్ సెటప్ పెట్టాడు. హ్యాట్రిక్ బాల్ కావడంతో ఫీల్డర్ల అందర్నీ సర్కిల్ లోపలకి తీసుకొచ్చిన స్టోక్స్.. స్లిప్‌లోనే నలుగురి ఫీల్డర్లను పెట్టాడు.
మరో ఇద్దర్నీ లెగ్ స్లిప్‌లో పెట్టి ఇంకో ఫీల్డర్‌ను షార్ట్ మిడాన్‌లో పెట్టాడు. బౌలర్, కీపర్‌ను కలుపుకొని మొత్తం 9 మంది ఆటగాళ్లు స్మిత్ చుట్టూ ఫీల్డ్ చేశారు. ఈ ఫీల్డ్ సెటప్‌తో తీవ్ర ఒత్తిడికి లోనైన స్మిత్.. బ్రాడ్ వేసిన హ్యాట్రిక్ బాల్‌ను అతి కష్టం మీద వదిలేసాడు. ప్రస్తుతం ఈ ఫీల్డ్ సెటప్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
బెన్ స్టోక్స్ అటాకింగ్ ఫీల్డ్ సెటప్ చూసి స్మిత్‌కు తడిసిపోయిందని, డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత చేసిన తప్పిదం ఇదేనని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పూర్తి ఆత్మరక్షణలో ఆడిన స్మిత్.. 59 బంతుల్లో 16 పరుగులే చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. డిఫెన్సీవ్ మోడ్‌లో ఆడటమే స్మిత్ కొంపముంచిందని ఆసీస్ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
67 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్(50) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ట్రావిస్ హెడ్(50), కామెరూన్ గ్రీన్(38)లను మొయిన్ అలీ పెవిలియన్ చేర్చగా.. క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీ(3 బ్యాటింగ్) సాయంతో ఉస్మాన్ ఖవాజా 199 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అంతకుముందు ఇంగ్లండ్.. జోరూట్(152 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 118 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 393/8వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.