లండన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో వరుసగా రెండు పరాజయాల తర్వాత విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. మాంచెస్టర్ వేదికగా జూలై 19- 23 మధ్య జరిగే నాలుగో టెస్ట్‌కు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. ఎలాంటి మార్పలు చేయకుండా మూడో టెస్ట్‌కు ఎంపిక చేసిన జట్టునే కొనసాగించింది.
ఇక మూడో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన జానీ బెయిర్ స్టోకు మరో అవకాశం కల్పించింది. దాంతో జట్టులోకి రావాలనుకుంటున్న బెన్ ఫోక్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో తొలి రెండు టెస్ట్‌ల్లో చేజేతులా ఓటమిపాలైన ఇంగ్లండ్.. కీలకమైన మూడో టెస్ట్‌లో మాత్రం సత్తా చాటింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలనే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బజ్‌బాల్ రుచి చూపిస్తూ అద్భుత విజయాన్నందుకుంది.

దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఖాతా తెరిచింది. హెడింగ్లీ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషిచాడు. బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీసిన అతను రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో 8 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఇంగ్లండ్ ఇదే జోరును కొనసాగించాలనుకుంటోంది. మాంచెస్టర్ టెస్ట్‌లో విజయం సాధిస్తే చివరి మ్యాచ్ డిసైడర్‌గా మారనుంది. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక జానీ బెయిర్ స్టోకు వరుసగా అవకాశాలు ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మూడో టెస్ట్‌కు క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ తుది జట్టులో చేరడంతో ఇంగ్లండ్ టీమ్ పటిష్టంగా మారింది. నాలుగో టెస్ట్ తుది జట్టులోనూ పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. విన్నింగ్ టీమ్‌నే కొనసాగించనున్నారు. అదే జరిగితే జేమ్స్ అండర్సన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్‌కు ఇంగ్లండ్ టీమ్:
బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్ స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, జోరూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.