లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ హోరాహోరీగా సాగుతోంది. తొలి టెస్ట్ మాదిరి మ్యాచ్‌పై పట్టు కోసం ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్.. తగ్గేదేలే అన్నట్లు ఊర మాస్ బ్యాటింగ్‌తో చెలరేగుతోంది. బజ్‌బాల్ వ్యూహంతో తొలి టెస్ట్‌లో ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా.. ఇంగ్లండ్ దూకుడుగానే బ్యాటింగ్ చేస్తోంది.
ఓవైపు వికెట్లు పడినా.. ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. బెన్ డకెట్(134 బంతుల్లో 9 ఫోర్లతో 98) తృటిలో శతకాన్ని చేజార్చుకోగా.. జాక్ క్రాలీ(48), ఓలీ పోప్(42) విలువైన పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో హ్యారీ బ్రూక్(45 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(17 బ్యాటింగ్) ఉన్నారు.

చేతిలో 6 వికెట్లు ఉన్న ఇంగ్లండ్.. ఇంకా 138 పరుగులు వెనుకడి ఉంది. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(184 బంతుల్లో 15 ఫోర్లతో 110) సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(73 బంతుల్లో 14 ఫోర్లతో 77), డేవిడ్ వార్నర్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. జోరూట్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తలో వికెట్ తీసారు.
మూడో రోజు ఆట మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది. దూకుడుగా ఆడుతూ ఇంగ్లండ్ ఆధిక్యాన్ని అందుకుంటే మ్యాచ్‌పై పట్టు సాధించనుంది. అలా కాకుండా త్వరగా ఆలౌట్ అయితే మాత్రం ఈ మ్యాచ్ కూడా ఆసీస్ చేతుల్లోకి వెళ్తోంది.
ఓవర్‌నైట్ స్కోర్ 339/5తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు మరీ ఎక్కువ స్కోరు చేయనివ్వలేదు. త్వరగా చివరి ఐదు వికెట్లు పడగొట్టి ఇన్నింగ్స్‌కు తెరదించారు. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 85తో కొనసాగించిన స్మిత్ సెంచరీ అనంతరం ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. కమిన్స్ 22 పరుగులతో అజేయంగా నిలిచినా.. ఇతర బ్యాటర్లను పెవిలియన్ చేర్చిన ఇంగ్లండ్ బౌలర్లు ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరదించారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా డకెట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. క్రాలీతో కలిసి గట్టి పునాది వేశాడు. నిలకడగా ఆడుతున్న క్రాలీని నాథన్ లయన్ బోల్తా కొట్టించడంతో 91 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సాధికారికంగా బ్యాటింగ్ చేస్తున్న డకెట్‌కు ఒలీ పోప్ తోడవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది.
ఓ దశలో 188/1తో ఆ జట్టు పటిష్టంగా, పట్టబిగించేలా కనిపించింది. ఆసీస్ బౌలర్లు చకచకా మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లోకి దూసుకొచ్చారు. పోప్‌ను ఔట్ చేయడం ద్వారా ప్రమాదకరంగా మారుతున్న రెండో భాగస్వామ్యాన్ని గ్రీన్ విడదీస్తే.. కాసేపటికి డకెట్‌ను హేజిల్‌వుడ్ పెవిలియన్ చేర్చాడు. జట్టు స్కోరు 222 వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ అందుకున్న డైవింగ్ క్యాచ్‌కు జో రూట్ నిష్క్రమించాడు.
అయితే బంతి పూర్తిగా అతడి చేతిలో లేకపోయినా థర్డ్ అంపైర్ రూట్ ఔటని ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత పట్టుదలగా నిలిచిన బ్రూక్, స్టోక్స్ మరో వికెట్ పడనివ్వలేదు. అభేద్యమైన అయిదో వికెట్‌కు 56 పరుగులు జోడించారు.