లార్డ్స్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం లభించింది. 278/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 325 పరుగులకు కుప్పకూలింది. 47 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు బెన్ స్టోక్స్(17) దారుణంగా విఫలమవ్వగా.. హ్యారీ బ్రూక్(50) హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగాడు.
ఆసీస్ పార్ట్‌టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్ చెలరేగడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/88) మూడు వికెట్లు తీసాడు. జోరూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్ ముగ్గురిని పెవిలియన్ చేర్చి ఆసీస్‌కు 91 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. ఇతర బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, నాథన్ లయన్, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.

ఒక్క వికెట్ కోల్పోయి 188 పరుగులు చేసిన ఇంగ్లండ్.. చివరి 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే రాబట్టింది. ఒక్క పరుగు వ్యవధిలోనే చివరి మూడు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఓలీ రాబిన్సన్(9), స్టువర్ట్ బ్రాడ్(12), జోష్ టంగ్(1) ఒక్క పరుగు వ్యవధిలోనే వెనుదిరిగారు. దాంతో ఇదేం బజ్‌బాల్ బ్యాటింగ్ అంటూ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.
ట్రావిస్ హెడ్ ఆ జట్టుకు ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్‌గా మారాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో దుమ్మురేపాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(184 బంతుల్లో 15 ఫోర్లతో 110) సెంచరీతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(73 బంతుల్లో 14 ఫోర్లతో 77), డేవిడ్ వార్నర్(66) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. జోరూట్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తలో వికెట్ తీసారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. 11 ఓవర్ల ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితే ఆసీస్ విజయం సులువవ్వనుంది.