బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుక్రవారం మొదలైన తొలి టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. తమ బజ్‌బాల్ వ్యూహాన్ని అమలు చేస్తూ మరోసారి ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగింది.
జోరూట్(152 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 118 నాటౌట్) శతక్కొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసేసమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(8 బ్యాటింగ్), ఉస్మాన్ ఖవాజా(4) క్రీజులో ఉన్నారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కలేదు. హజల్ వుడ్ బౌలింగ్‌లో ఓపెనర్ బెన్ డకెట్(12) అయినా.. ఇంగ్లండ్ తమ బజ్‌బాల్ కాన్సెప్ట్‌తోనే బ్యాటింగ్ చేసింది. ఓలీపోప్(31), హ్యారీ బ్రూక్(32), బెన్ స్టోక్స్(1) నిరాశపర్చినా.. 176 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినా బ్యాటింగ్‌లో దూకుడు తగ్గించలేదు.
ఓవర్‌కు 5 పరుగులు చొప్పున రాబట్టారు. కఠిన పరిస్థితుల్లోనూ జోరూట్, జానీ బెయిర్‌స్టో (78 బంతుల్లో 12 ఫోర్లతో 78) ధనాధన్ ఆటతో జట్టును ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించిన అనంతరం బెయిర్ స్టో ఔటైనా.. స్పిన్నర్ నాథన్ లయన్(4/149) ఒకవైపు దెబ్బ తీస్తున్నా.. జోరూట్ మాత్రం తగ్గలేదు.
దూకుడుగా ఆడుతూ.. కళ్లు చెదిరే రివర్స్ స్వీప్ సిక్స్‌లతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టెస్ట్‌ల్లో 30వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో రెండు వికెట్లు చేతిలో ఉండటంతో పాటు క్రీజులో రూట్ ఉండటంతో తొలి రోజే ఇంగ్లండ్ 400 ప్లస్ పరుగులు చేసేలా కనిపించింది. కానీ అతని సెంచరీ పూర్తవ్వగానే అనూహ్యంగా ఇంగ్లండ్ డిక్లేర్ చేసింది.
ఆసీస్ వికెట్ తీయాలనే లక్ష్యంతో ఇంగ్లండ్ ఈ పనిచేసినట్లు అనిపించింది. కానీ ఆచితూచి ఆడిన వార్నర్, ఖవాజా వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు. ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆ జట్టుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంగ్లండ్ బజబాల్ దెబ్బకు ఆసీస్ బద్దలు బాషింగాల్ అయినాయని కామెంట్ చేస్తున్నారు.