
బ్రిస్బేన్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అసలే ఓటమి బాధతలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ గట్టిషాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్‌పై భారీ జరిమానాతో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్స్‌లో కోత విధించారు.
తొలి టెస్టులో ఇంగ్లండ్ నిర్ణీత సమయం కన్నా ఐదు ఓవర్లు నెమ్మదిగా వేసింది. దీంతో మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఇంగ్లండ్ జట్టు మ్యాచ్ ఫీజుపై 100 శాతం కోత విధించాడు. ఐసీసీ నియమావళి ఉల్లంఘన నేపథ్యంలో ఆర్టికల్ 2.22 ప్రకారం.. ఆటగాళ్లపై ప్రతి స్లో ఓవర్‌కు 20 శాతం కోత విధిస్తారు. ఈ లెక్కన 5 ఓవర్లకు 100 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న సిరీస్ కావడంతో ఇంగ్లండ్ ఐదు పాయింట్లు కోల్పోయింది.
మరోవైపు తొలి టెస్టులో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్ పై కూడా మ్యాచ్ రిఫరి చర్యలు తీసుకున్నారు. ప్రత్యర్థి ఆటగాళ్లపై అసభ్య పదజాలం ఉపయోగించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. ఆసీస్ ఇన్నింగ్స్ 77వ ఓవర్లో ట్రావిస్ హెడ్ సహనం కోల్పోయి ప్రత్యర్థి ఆటగాళ్లపై నోరు పారేసుకున్నాడు. ఐసీసీ నియమాల ఉల్లంఘన నేపథ్యంలో ఆర్టికల్ 2.3 ప్రకారం అతని మ్యాచ్ ఫీజులో కోతతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ విధించారు.
ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆతిథ్య ఆసీస్.. 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించిన కమిన్స్ సేన.. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. 220/2 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్ మరో 77 పరుగులకే మిగతా వికెట్లు కోల్పోయింది.
దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ సాధించిన 19 పరుగుల ఆధిక్యాన్ని ఆసీస్ 5.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ధనాధన్ బ్యాటింగ్‌తో విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ (148 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 152) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 149 పరుగులే చేయగా.. ఆస్ట్రేలియా 425 పరుగుల భారీ స్కోర్ చేసింది.