
మహీ సరసన అఫ్గానిస్థాన్ కెప్టెన్:
అఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ తాజాగా అరుదైన రికార్డు సాధించాడు. టీ20ల్లో అస్గర్ నాయకత్వంలో అఫ్ఘనిస్తాన్ జట్టు 41 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం ద్వారా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు అస్గర్ 51 మ్యాచ్‌ల్లో ఆప్ఘన్ జట్టుకు నాయకత్వం వహించగా.. ఇందులో 41 మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్నాడు. టీమిండియా తరపున ధోనీ తన కెరీర్‌లో 72 టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ వహించగా.. ఇందులో 41 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది.

విజయాల శాతం పరంగా:
ఇక విజయాల శాతం పరంగా చూసుకుంటే.. ఎంఎస్ ధోనీ కన్నా అస్గర్ అఫ్గాన్ ముందున్నాడు. ధోనీ 59.28 శాతం విజయాల్ని సొంతం చేసుకోగా.. అస్గర్ ఏకంగా 81.37 శాతం విజయాల్ని నమోదు చేయడం గమనార్హం. మొత్తం 51 టీ20లకు నాయకత్వం వహించిన అస్గర్ కేవలం 10 మ్యాచ్‌ల్లోనే విఫలమయ్యాడు. దాంతో అతడి విజయ శాతం 81.37గా నమోదైంది. ఇది ధోనీ కన్నా గొప్ప రికార్డు. మహీ 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మూడో టీ20లో అఫ్గాన్ గెలిస్తే.. మహీని దాటేస్తాడు.

సిరీస్ కైవసం:
యూఏఈ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన అఫ్గానిస్థాన్.. 2-0తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఈ రెండు విజయాలతో అస్గర్.. మహీ సరసన చేరాడు. అబుదాబి వేదికగా తాజాగా జరిగిన రెండో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ టీమ్ 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన జింబాబ్వే 17.1 ఓవర్లలోనే 148 పరుగులకే కుప్పకూలింది.

అగ్రశ్రేణి జట్లకి షాక్‌లిస్తూ:
పసికూన అఫ్గానిస్థాన్ జట్టు గత కొంతకాలంగా అగ్రశ్రేణి జట్లకి షాక్‌లిస్తూ.. క్రికెట్‌లో వేగంగా ఎదుగుతోంది. టెస్టు, వన్డేల కంటే టీ20ల్లో మెరుగ్గా రాణిస్తున్న ఆ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో ఆ జట్టు ఆటగాళ్లు రెగ్యులర్‌గా ఆడుతుండటంతో.. అఫ్గానిస్థాన్ టీ20 టీమ్ ప్రమాణాలు కూడా గణనీయంగా పెరిగాయి. రషీద్ ఖాన్, మొహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లాంటి స్టార్ ఆటగాళ్లు పలు లీగుల్లో సత్తాచాటుతున్నారు.
Goli Shyamala: 13 గంటలు.. 30 కిలోమీటర్లు! తెలంగాణ స్విమ్మర్ ప్రపంచ ఘనత!


Click it and Unblock the Notifications












