
హైదరాబాద్: నలుమూలలా ఎటు చూసినా సముద్రమే! హోరు గాలి.. ఎగిసే అలల మధ్య ఎంతో ధైర్యంతో సముద్రాన్ని ఈది భళా అనిపించారు హైదరాబాద్‌కు చెందిన 47 ఏళ్ల గోలి శ్యామల. తమిళనాడు-శ్రీలంకలోని జాఫ్నా జిల్లాను కలిపే పాక్ జలసంధిని 30 కిలో మీటర్లను నిర్విరామంగా 13 గంటల 43 నిమిషాల పాటు ఈదారు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండో మహిళగా శ్యామల రికార్డుల్లోకి ఎక్కారు. అంతేకాదు తొలి తెలుగు మహిళగా శ్యామల చరిత్రకెక్కారు.
శుక్రవారం తెల్లవారుజామున శ్రీలంకలోని పాక్ జలసంధిలో (తలైమన్నార్) ఈత మొదలుపెట్టిన గోలి శ్యామల.. 13 గంటల 43 నిమిషాల పాటు బంగాళాఖాతంలో ఏకధాటిగా ఈది తమిళనాడు రామేశ్వరంలోని ధనుష్కోడి (అరిచల్మునై) తీరానికి చేరుకున్నారు. గతంలో ఈ సముద్ర మార్గాన్ని పన్నెండున్నర గంటల్లో పూర్తి చేసిన ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది వద్ద సముద్రపు ఈతలో శ్యామల శిక్షణ పొందారు. అనతి కాలంలో పట్టుదలతో కఠినతరమైన మార్గంలో ఈతను విజయవంతంగా పూర్తి చేసిన శ్యామలపై ప్రశంసల వర్షం కురుస్తున్నది.
యానిమేషన్ చిత్రాల నిర్మాత అయిన గోలి శ్యామల డైరెక్టర్‌గా, రచయితగా విభిన్న పాత్రల్లో రాణిస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే స్విమ్మింగ్‌లోకి ప్రవేశించిన శ్యామల.. దక్షిణకొరియాలోని గ్వాన్‌జులో గతేడాది జరిగిన ఫినా వరల్డ్ మాస్టర్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. గతేడాది నవంబరులో గంగా నదిలో 30 కి.మీ. దూరాన్ని కేవలం 110 నిమిషాల్లో ఈది ఆరో స్థానంలో నిలిచారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది ఆధ్వర్యంలో శ్యామల.. పాక్ జలసంధిని ఈదడంలో శిక్షణ పొందారు. త్రివేది కూడా 2012లో పాక్ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లో ఈదారు. గచ్చిబౌలిలోని శాట్స్ స్విమ్మింగ్ పూల్‌లో ఆయుష్ యాదవ్ ఆమె కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈత అనంతరం గోలి శ్యామల విలేకరులతో మాట్లాడుతూ... 'ఇది మహిళల విజయం. ఈ ఘనత మహిళా లోకానికి స్ఫూర్తి. మహిళలు అత్యున్నత లక్ష్యాలు నిర్దేశించుకొనేలా ప్రేరేపిస్తుంది. అంతేకాదు మహిళలు సాధించలేనిది ఏదీ లేదనే నమ్మకాన్ని వారిలో కలిగిస్తుంది. చాలామంది ఇంగ్లీష్ ఛానెల్‌లో ఈత కొట్టినప్పటికీ.. నేను భారతదేశంలో చేయాలనుకున్నా. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజేష్ త్రివేది నన్ను ప్రోత్సహించారు. నేను గత నాలుగు సంవత్సరాలుగా ఈత కొడుతున్నాను. గత సంవత్సరమే ఈదాలనుకున్నా కానీ కోవిడ్ -19 కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. భారత్ మరియు శ్రీలంకకు ప్రత్యేక ధన్యవాదాలు' అని అన్నారు.