
హైదరాబాద్: ఐసీసీ మెగా టోర్నీల్లో పాకిస్థాన్‌ను చితక్కొట్టే టీమిండియా.. ఈ సారి బొక్క బోర్లా పడింది. ఎలాగూ గెలుస్తామన్న అలసత్వమో, లేక అతి విశ్వాసమోగానీ, గతంలో ఎన్నడూ చూడని రీతిలో కోహ్లీసేన.. గ్రౌండ్‌లో దాయాది ముందు దూది పింజులా తేలిపోయింది. దాంతో టీ20 ప్రపంచకప్‌ను భారత్ ఓటమితో మొదలుపెట్టింది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోకయిన కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని టార్గెట్ చేశారు. పాకిస్థాన్‌పై షమీ పక్షపాత ధోరణిని ప్రదర్శించాడని, తోటి ముస్లిం జట్టు కావడం వల్లే తన స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటలేకపోయాడంటూ మండిపడుతున్నారు. వెంటనే షమీ పాక్‌కు వెళ్లిపోవాలని అనుచితంగా కామెంట్ చేశారు.
అయితే ఈ ట్రోలింగ్‌పై అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. షమీకి అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు. షమీ ఓ చాంపియన్ బౌలర్ అని, అతను ఇంతా దూషించడం సరికాదని చురకలంటించారు. ఇక సోషల్ మీడియాలో షమీకి వ్యతిరేకంగా పోటెత్తుతున్న జాత్యహంకార వ్యాఖ్యలపై ఎమ్‌ఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడానికి మహ్మద్ షమీ ఒక్కడే బాధ్యుడా? అంటూ నిలదీశారు. దేశంలో ముస్లింల పట్ల ఎంత ధ్వేషం వ్యక్తమౌతున్నదో.. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఈ ఓటమికి భారత జట్టు మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందే తప్ప.. ఏ ఒక్కరికో దాన్ని అంటగట్టడం సరికాదని ఒవైసీ అన్నారు. ముస్లిం కావడం వల్లే మహ్మద్ షమీని సోషల్ మీడియా టార్గెట్ చేసిందని ఆరోపించారు. దీని వెనుక భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని విమర్శించారు. సంఘ్ పరివార్ కార్యకర్తలు ముస్లిం ప్లేయర్‌కు వ్యతిరేకంగా ఇలాంటి విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అతని మానసిక స్థైర్యాన్ని దెబ్బకొడుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ చెప్పుకొచ్చారు.
ఈ మ్యాచ్‌లో షమీ దారుణంగా విఫలమయ్యాడు. 3.5 ఓవర్లను సంధించిన అతను 43 పరుగులను సమర్పించుకున్నాడు. అయితే షమీనే కాకుండా ఇతర బౌలర్లు సైతం పోటాపడి మరి పరుగులు ఇచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' షాహిన్ అఫ్రిది (3/31) దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా జట్టును గెలిపించారు.