IND vs PAK: భారత సైనికులు చస్తుంటే పాక్‌తో టీ20 ఆడతారా? ప్రధానిని ప్రశ్నించిన ఒవైసీ!

హైదరాబాద్: జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని టీమిండియాకు సూచించారు. కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సైతం ఈ మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలన్నాడు. తాజాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం భారత్-పాక్ మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేశాడు. సరిహద్దుల్లో పాకిస్థాన్ చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.

భారత పౌరులతో 20-20 ఆడుతుంటే..
'జమ్మూకశ్మీర్‌లో గత కొంతకాలంగా జరుగుతోన్న ఉగ్ర దాడుల్లో ఇప్పటివరకు తొమ్మిదిమంది సైనికులు అమరులయ్యారు. భారత పౌరుల జీవితాలతో పాకిస్థాన్ నిత్యం 20-20 ఆడుతోంది. ఇలాంటి సమయంలో అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో భారత్ టీ20 మ్యాచ్ ఆడబోతోంది. సైనికులు మరణిస్తున్నా పాకిస్థాన్‌తో టీ20 ఆడతారా?' అని ఒవైసీ ప్రశ్నించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వ వైఫల్యం వల్లే జమ్మూ కశ్మీర్‌లో సామాన్య పౌరుల హత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.

వలస కూలీలే లక్ష్యంగా..
గతకొన్ని రోజులుగా కశ్మీర్‌లో సాధారణ ప్రజలపై ఉగ్రదాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చిన కూలీలను శ్రీనగర్, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు హత్యచేశారు. ఇలా గడిచిన నాలుగు వారాల్లోనే ఐదుగురు స్థానికేతరులను ఉగ్రవాదులు చంపేయడం అక్కడి వలస కూలీల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ముఖ్యంగా చిరు వ్యాపారులు, వలస కూలీలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేస్తుండడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు తిరిగి వారి స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా ఉగ్రవాదులు 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ క్రమంలోనే పాక్‌తో క్రికెట్ రద్దు చేయాలనే డిమాండ్ వ్యక్తమైంది. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket ట్యాగ్ ట్రెండ్ అయింది.

రద్దు చేయడం కుదరదు..
ఈ మెగా మ్యాచ్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించాడు. ఉగ్రవాదుల దాడులను ఖండించిన అతను.. మ్యాచ్‌ను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశాడు. ''జమ్మూ కశ్మీర్‌లో జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక మ్యాచ్ విషయానికొస్తే... ఐసీసీకి ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారం.. ఏదేని ఒక జట్టుతో మేము మ్యాచ్ ఆడలేమని తిరస్కరించే వీలులేదు. ఐసీసీ టోర్నమెంట్‌లో కచ్చితంగా ఆడాల్సిందే'' అని స్పష్టం చేశారు.

హాట్ కేకుల్లా టికెట్లు..
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో దాయాది దేశాలైన భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి. భారత్ తొలి మ్యాచ్ ఈ నెల 24న పాకిస్థాన్‌తో జరగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ఎప్పుడెప్పుడు మ్యాచ్ చూద్దామా అని ఆశగా ఉన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ, ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే భారత్-పాక్ జట్లు తలపడుతున్నాయి.
దాంతో మెగాటోర్నీలో జరిగే మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. టీ20 ప్రపంచకప్ కోసం టిక్కెట్ల విక్రయం ప్రారంభం కాగా.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎవరూ ఊహించని విధంగా టిక్కెట్లు ఓ గంటలోనే అమ్ముడుపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నా.. టిక్కెట్లు గంటలోనే అమ్ముడుపోవడం విశేషం. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు దాయాదుల పోరుకు ఎంత క్రేజ్ ఉందొ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications