నాకు క్రికెట్‌పై ఆసక్తి కలగడానికి ఆమెనే కారణం.. ఆ మ్యాచ్ ఓ గుణపాఠం: టీమిండియా యువ పేసర్

హైదరాబాద్: తనకు క్రికెట్‌పై ఆసక్తి కలగడానికి వన్డే కెప్టెన్ మిథాలీ రాజే కారణమని భారత మహిళల పేస్ బౌలర్, హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డి తెలిపింది. ఆటలో ఎదిగేందుకు కూడా ఆమెనే స్పూర్తని పేర్కొంది. గత మూడేళ్లుగా టీ20 ఫార్మాట్‌లో కీలక ప్లేయర్‌గా ఎదిగిన అరుంధతి తొలిసారి వన్డే, టెస్టు జట్టులోకి ఎంపికైంది. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో పాల్గొనే టీమ్‌లో ఆమెకు అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుంధతి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇంగ్లండ్‌లో ఆడటం తన కలని, అది నేరవేరుతుందని సంతోషం వ్యక్తం చేసింది.

మిథాలీ అక్క అండ..
'నాకు క్రికెట్‌పై ఆసక్తి కలగడానికి, ఆటలో ఎదిగేందుకు కూడా మిథాలీ రాజ్ అక్కనే స్ఫూర్తి. ఆమె ఆటను బాగా దగ్గరినుంచి చూశాను. నేను జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన సమయంలో జట్టులో మిథాలీ అక్క కూడా ఉంది. రైల్వేస్ జట్టు తరఫున ఆమె కెప్టెన్సీలో ఆడుతున్నా. సీనియర్ ప్లేయర్‌గా, మన హైదరాబాదీగా కూడా అన్ని సందర్భాల్లో మిథాలీ సహకారం నాకు లభించింది. నన్ను బాగా ప్రోత్సహిస్తూ తగిన విధంగా మార్గనిర్దేశం చేస్తోంది.

నోబాల్ వేయకుంటే..
ఇటీవల లక్నోలో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20ని నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. ఇలాంటి అనుభవంతో మున్ముందు తప్పులు సరిదిద్దుకుంటా. నేను గెలిపించాల్సిన మ్యాచ్‌లో విఫలమయ్యాను. చివరి ఓవర్లో సఫారీ జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా...తొలి 4 బంతుల్లో 3 పరుగులే ఇచ్చాను. తర్వాతి 3 బంతుల్లో 6 పరుగులు కావాలి. అయితే ఐదో బంతి 'నోబాల్'గా వేశాను. అదనపు బంతితో వారికి మరో అవకాశం లభించి చివరి బంతికి విజయం సాధించగలిగారు. నేను 'నోబాల్' వేయకుంటే మా జట్టు గెలిచేదేమో.

బౌలింగ్‌తో పాటు..
అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత నా బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం పెంచేందుకు ఎంతో శ్రమించా. కెరీర్ ఆరంభ రోజులతో పోలిస్తే ఇప్పుడు నా బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు సాధనతో లోపాలు సరిదిద్దుకుంటున్నా. ఇన్‌స్వింగర్ నా 'స్టాక్ బాల్' కాగా...అవుట్ స్వింగర్లు, ఆఫ్ కట్టర్లను సమర్థంగా ప్రయోగించగలుగుతున్నా. ఎన్‌ఎస్ గణేశ్ వద్ద కోచింగ్ మొదలు పెట్టిన నాకు రైల్వేస్ టీమ్‌కు ఆడే సమయంలో మూర్తి సహకరిస్తున్నారు. ఇతర సమయంలో ఆల్ఫ్రెడ్ అబ్సలమ్ వద్ద ప్రాక్టీస్ కొనసాగిస్తున్నా. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టా.

ఇంగ్లండ్‌లో ఆడాలనేది నా కల
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. భారత జట్టుకు ఇప్పటికే ప్రాతినిధ్యం వహించినా... మరో ఫార్మాట్‌లో నాకు కొత్తగా అవకాశం దక్కుతోంది. టీ20ల్లో నిలకడగా రాణించడం వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందని నమ్ముతున్నా. వన్డేల్లోనూ రాణించి జట్టు విజయంలో నేనూ పాత్ర పోషించగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఇంగ్లండ్‌లో ఆడాలనేది నా కల. ఇప్పుడు అక్కడికే భారత జట్టు తరఫున వెళుతుండటం గర్వకారణం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications