
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై సంచలన ఆరోపణలను చేసిన వెటరన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా చిక్కుల్లో పడ్డాడు. శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ సీనియర్ వికెట్ కీపర్.. జట్టులో చోటుపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ భరోసా ఇస్తే.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ ఆలోచన చేయాలని సూచించాడని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు నిబంధనలు అతిక్రమించాయని, వివరణ ఇవ్వాలని సాహాకు బీసీసీఐ షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఆటగాళ్లు.. జట్టు ఎంపిక, ఆట గురించి, ఆటలో జరిగే సంభాషణలను బహిరంగపరచడం బీసీసీఐ నిబంధనలకు విరుద్ధం. జాతీయ స్థాయి ఆటగాడు ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలోనే సాహా నుంచి బీసీసీఐ వివరణ కోరనుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అయితే సాహాకు షోకాజ్ నోటీస్‌లు పంపడంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధూమల్ అన్నారు. భవిష్యత్‌లో ఇచ్చే అవకాశం మాత్రం ఉందని తెలిపారు.
అసలేం జరిగిందంటే.. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు సెలెక్టర్లు సాహాను పక్కనపెట్టారు. అతనిపై వేటు వేయడానికి గల కారణాలను తెలియజేయాల్సి అవసరం లేదని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ మీడియాతో అన్నాడు. ఈ వ్యాఖ్యలతో కొంత అసంతృప్తికిలోనైనా సాహా.. ఓఇంటర్వ్యూలో టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్‌పై ఆలోచన చేయాలని కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడని ఆరోపించాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్ అనంతరం బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ప్రశంసిస్తూ జట్టులో చోటుపై భరోసా ఇచ్చాడని తెలిపాడు. కానీ ఇంతలోనే పరిస్థితులన్నీ మారిపోయాయని సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కోసం తనను ఇబ్బంది పెట్టాడని, అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని సాహా ట్వీట్ చేశాడు. సదరు జర్నలిస్ట్ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను కూడా అభిమానులతో పంచుకున్నాడు. దాంతో వివాదాలకు దూరంగా ఉండే సాహా గత వారం రోజులుగా వార్తల్లో నిలిచాడు. తనను బెదిరించిన జర్నలిస్ట్ పేరు చెప్పడానికి సాహా నిరాకరించాడు.