ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ను రెండు ఎడిషన్లు పాటు నిర్వహిస్తే బాగుంటుందని గతంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సూచించాడు.
ద్వైపాక్షిక సిరీస్‌లను తగ్గించి.. ఒకే ఏడాదిలో తక్కువ మ్యాచ్‌లతో రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ దిశగా బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే ఏడాదిలో రెండో ఎడిషన్ నిర్వహించడానికి బీసీసీఐకి ఉన్న ఏకైక సమస్య ఇంటర్నేషనల్ క్రికెట్ ఫ్రీగా ఉన్న విండో దొరకడం. ఇప్పటికే ఐసీసీ ఈవెంట్స్, ద్వైపాక్షిక సిరీస్‌లతో వచ్చే రెండేళ్ల పాటు ఉక్కిరి బిక్కిరయ్యే షెడ్యూల్ ఉంది.

ఒకే ఏడాది రెండు ఎడిషన్స్ నిర్వహించడంపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటికే తాము 84 రోజుల ఖాళీ విండోను కనుగోవాల్సి వస్తోంది. రెండు ఎడిషన్స్ నిర్వహించాలంటే 94 రోజుల విండోను కనుగొనాలి'అని చెప్పారు. అయితే రెండు ఎడిషన్స్ నిర్వహించే విషయానికి బోర్డు ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు.
రెండు ఎడిషన్స్ నిర్వహించడం వల్ల భారత క్రికెట్‌కు మేలు జరుగుతుందని చెప్పారు. ఒక వేళ రెండు ఎడిషన్స్ నిర్వహిస్తే టీ10 ఫార్మాట్ లేక టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తారా? అనే విషయంపై కూడా అరుణ్ ధూమల్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ10 ఫార్మాట్ గురించి తాము ఆలోచించడం లేదని, భారత క్రికెట్‌కు మేలు జరిగే నిర్ణయమే తీసుకుంటామని చెప్పారు.

అభిమానులను ఎంటర్‌టైన్ చేయడానికే బీసీసీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అరుణ్ ధూమల్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల ప్రదర్శన కంటే అభిమానుల ప్రేమతోనే ఐపీఎల్ సక్సెస్ అయ్యిందని అభిప్రాయపడ్డారు. భారతలో క్రికెట్‌ను నడిపించేదే అభిమానులని, వారి ఎంటర్‌టైన్‌మెంటే మాకు ప్రాధాన్యమని చెప్పారు.
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ 22 మ్యాచ్‌ల షెడ్యూల్ మాత్రమే వెల్లడించింది. చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.