పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్ ఓవరాక్షన్‌కు టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా గత ఆదివారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హరీస్ రౌఫ్ అతిగా ప్రవర్తించాడు. భారత ఆటగాళ్లతో పాటు అభిమానులను తన చర్యలతో కవ్వించాడు. అభిషేక్ శర్మతో గొడవకు దిగాడు.
అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ అతను చేసిన సంజ్ఞలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. భారత్‌కు చెందిన 6 రఫెల్ జెట్ ఫ్లైట్స్‌ను కూల్చామని, యుద్దంలో తమదే విజయమని పేర్కొంటూ 6-0 సంజ్ఞలు చేశాడు. అంతకు ముందు విమానాన్ని కూల్చేసినట్లు సైగలు చేశాడు. హరీస్ రౌఫ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ పాకిస్థాన్ మాత్రం అతని అండగా నిలుస్తుంది. ఆ దేశానికి చెందిన మహిళా క్రికెటర్లు, ఫుట్ బాల్ ప్లేయర్లు హరీస్ రౌఫ్‌కు అండగా 6-0 సంజ్ఞలు చేస్తున్నారు.

అతని సతీమణి సైతం హరీస్ రౌఫ్‌ను వెనకెసుకొచ్చింది. మ్యాచ్ ఓడినా.. యుద్దం మాత్రం తామే గెలిచామని క్యాప్షన్‌గా పేర్కొంది. అయితే ఈ మ్యాచ్ రోజే హరీస్ రౌఫ్‌కు అర్ష్‌దీప్ సింగ్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ బ్రేక్ సమయమో లేక మ్యాచ్ తర్వాతో తెలియదు కానీ.. హరీస్ రౌఫ్ సైగలను మడిచి పెట్టుకోవాలని సంజ్ఞలు చేశాడు. ఈ వీడియోతో పాటు హరీస్ రౌఫ్ సంజ్ఞలను ఎడిట్ చేసి కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. కౌంటర్ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ ప్రయోగించిన 6 రఫేల్ జెట్లను కూల్చామని పాకిస్థాన్ అబద్దపు ప్రకటన చేసింది. ఇప్పటి వరకు ఈ 6 జెట్ ఫ్లైట్స్‌కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టలేదు. కానీ ఆ దేశ ఆటగాళ్లు ఇదే విషయాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.