IND vs AUS 5th T20I:ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకోవడంపై టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా అర్ష్‌దీప్ సింగ్.. డేంజరస్ బ్యాటర్ మాథ్యూవేడ్‌ను ఔట్ చేయడంతో పాటు 4 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్నిందించాడు.
అయితే ఈ మ్యాచ్‌లో తన వల్లే టీమిండియా ఓడిపోతుందని బాధపడ్డానని మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. తొలి మూడు ఓవర్లలో ధారళంగా పరుగులివ్వడంతో ఆందోళనకు గురయ్యానని చెప్పాడు. చివరి ఓవర్ రూపంలో తనకు మరో అవకాశం దక్కిందని, సూర్యకుమార్ యాదవ్ అండగా నిలవడంతో కట్టడిగా బౌలింగ్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించానన్నాడు.

'ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు చాలా భయపడ్డాను. ధారళంగా పరుగులివ్వడంతో నా వల్లే జట్టు ఓడిపోతుందని ఆందోళనకు గురయ్యాను. కానీ ఆ దేవుడు చివరి ఓవర్ రూపంలో నాకు మరో అవకాశం ఇచ్చాడు. ఆత్మవిశ్వాసంతో చివరి ఓవర్‌ను బౌలింగ్ చేశాను. 10 పరుగులు డిఫెండ్ చేసేలా చేసి ఆ దేవుడికి కృతజ్ఞతలు. అలానే నాపై నమ్మకం ఉంచిన కెప్టెన్ సూర్య, సపోర్ట్ స్టాప్‌కు ధన్యవాదాలు.
నిజాయితీగా చెప్పాలంటే చివరి బౌలింగ్ చేస్తున్నప్పుడు నా మదిలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేవు. సూర్య భాయ్ నాకు ఒక్కటే చెప్పాడు. ఏదైనా జరగని నిర్భయంగా బౌలింగ్ చేయమని సూచించాడు. ఈ విజయం క్రెడిట్ మా బ్యాటర్లదే. బ్యాటింగ్‌కు కఠినంగా ఉన్న పిచ్‌పై మాకు పోరాడే లక్ష్యాన్ని అందించారు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే.
ఈ సిరీస్‌లో నా వ్యక్తిగత ప్రదర్శన ఆశించిన రీతిలో లేదు. నా బౌలింగ్ తీరును సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తులో మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ నాకు ఓ గుణపాఠం. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటా. భారత జట్టు ప్రమాణాలకు తగ్గట్లు నా బౌలింగ్ లేదు. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత బలంగా కమ్ బ్యాక్ చేస్తా.'అని అర్ష్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీసి 40 పరుగులిచ్చాడు. తొలి మూడు ఓవర్లలోనే 36 పరుగులు సమర్పించుకున్నాడు.