టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్ ఫస్ట్‌బాల్‌కే వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
అమెరికా ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ షయన్ జహంగీర్(0)ను వికెట్ల ముందు బోల్తాకొట్టించిన అర్ష్‌దీప్ సింగ్.. గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్‌తో అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కు వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. టీమిండియా టీ20ల్లోకి అరంగేట్రం చేసిన 18 ఏళ్ల తర్వాత 222వ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ అందుకోవడం గమనార్హం.

టీ20 క్రికెట్‌లో ఇలా ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే వికెట్ తీయడం 71వ సారి. కానీ భారత్ బౌలర్ ఈ ఫీట్ సాధించడం మాత్రం ఇదే తొలిసారి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కు వికెట్ తీయడం ఇది ఐదోసారి.
2014 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ బౌలర్ మష్రఫే మోర్తజా తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. అఫ్గాన్ బ్యాటర్ మహమ్మద్ షెహ్‌జాద్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. అదే టోర్నీ షాపూర్ జడ్రాన్ ఈ ఫీట్ నమోదు చేయగా.. 2021లో నమీబియా బౌలర్ రుబెన్ ఈ ఘనతను అందుకున్నాడు. తాజా టోర్నీలో నమీబియా బౌలర్ రుబెన్, భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించారు.
టీ20 ప్రపంచకప్ 2024లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా కూడా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు నమోదు చేశాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్(4/11), హర్భజన్ సింగ్(4/12), ఆర్‌పీ సింగ్(4/13), జహీర్ ఖాన్(4/19), ప్రజ్ఙాన్ ఓజా(4/21)లను అర్ష్‌దీప్ సింగ్ అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీష్ కుమార్(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27), స్టీవెన్ టేలర్(30 బంతుల్లో 2 సిక్స్‌లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(4/9) నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/14) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్(1/25)కు ఓ వికెట్ దక్కింది.