
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు ప్రమోషన్ లభించింది. అతను తొలిసారి ముంబై సీనియర్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 10 నుంచి ఆరంభమయ్యే దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం 22 మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో అర్జున్‌కు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) చోటు కల్పించింది. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్‌తో పాటు మరో పేసర్ కృతిక్ హనగవాడిని కూడా టీమ్‌కు సెలెక్ట్ చేసినట్టు ముంబై చీఫ్ సెలెక్టర్ సలిల్ అంకోలా శనివారం తెలిపారు.
ఈ టోర్నీ కోసం బీసీసీఐ తొలుత 20 మంది ప్లేయర్లనే ఎంపిక చేయాలని చెప్పిందని, తర్వాత 22 మందిని తీసుకోవచ్చని స్పష్టం చేయడంతో ఈ ఇద్దరిని టీమ్‌లో చోటు కల్పించామన్నారు. ముంబై తరఫున ఇప్పటి వరకు అండర్-14, 16, 19 టోర్నీల్లో పాల్గొన్న అర్జున్... తొలిసారి సీనియర్లతో కలిసి ఆడనున్నాడు. ఇదివరకు టీమిండియా నెట్ బౌలర్‌గా వ్యవహరించిన అర్జున్ గతంలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ముస్తాక్ అలీ టోర్నీలో 21 ఏళ్ల అర్జున్ రాణిస్తే అతని ఐపీఎల్ ఎంట్రీ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఏడాదే ఉండే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇక టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా బరోడాకు ఆడనున్నాడు. మరో ఆల్‌రౌండర్ దీపక్ హుడాను కూడా బరోడా టీమ్‌కు సెలెక్ట్ చేశారు.