ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2024 తొలి రౌండ్ మ్యాచ్‌లో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు అవకాశం దక్కలేదు. దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్.. మణిపూర్‌తో మొదలైన తొలి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దాంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.
15 మంది సభ్యులతో కూడిన గోవా రంజీ టీమ్‌లో అర్జున్ టెండూల్కర్‌కు చోటుదక్కినప్పటికీ.. తుది జట్టులో అవకాశాన్ని అందుకోలేకపోయాడు. ముంబై జట్టు తరఫున 2020-21 రంజీ సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్.. 2022/23 సీజన్ ప్రారంభానికి ముందు గోవాకు మారాడు. ముంబై జట్టులో నెలకొన్న పోటీతో పాటు తుది జట్టులో అవకాశం దక్కడం కష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

గోవా తరఫున రెగ్యూలర్‌గా మూడు ఫార్మాట్లు ఆడుతున్న అర్జున్ టెండూల్కర్.. ఇప్పటి వరకు 13 ఫస్ట్ క్లాస్, 15 లిస్ట్-ఏ, 21 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు 21 వికెట్లతో పాటు 481 రన్స్ చేశాడు. గోవా తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్జున్ టెండూల్కర్ శతకం సాధించాడు. అతని ఖాతాలో మరో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
50 ఓవర్ల క్రికెట్‌లో 21 వికెట్లు తీసిన అర్జున్ టెండూల్కర్.. టీ20ల్లో 26 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2021లో అతన్ని ముంబై ఇండియన్స్ కనీస ధరు రూ. 20 లక్షలకు తీసుకుంది. ఐపీఎల్ 2022 మెగా వేలం రూ. 30 లక్షలకు తిరిగి కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్ 2024లో ఒక మ్యాచ్ ఆడాడు.
ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరఫున 5 మ్యాచ్‌లే ఆడిన అర్జున్ టెండూల్కర్‌ను ఆ జట్టు వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కనీస ధరకు మళ్లీ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.