న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్‌తో నెలకొన్న గొడవపై టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వివరణ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగా అతన్ని బంతితో కొట్టలేదని స్పష్టం చేశాడు. బంతిని వికెట్ల వైపు విసిరితే అది స్వింగ్ అయ్యి అతనికి తగిలిందన్నాడు. అందుకు డారిల్ మిచెల్‌కు క్షమాపణలు కూడా చెప్పానని వెల్లడించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా 96 పరుగుల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మూడో టీ20 ప్రపంచకప్ గెలవడంతో పాటు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా.. వరుసగా రెండో టైటిల్ అందుకున్న టీమ్‌గా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.
అయితే ఈ మ్యాచ్‌లో డారిల్ మిచెల్‌పైకి అర్ష్‌దీప్ సింగ్ బంతిని విసరడం వివాదాస్పదమైంది. తన బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లు బాదడంతో సహనం కోల్పోయిన అర్ష్‌దీప్ సింగ్.. కోపంతో బంతిని వికెట్ల వైపు కొట్టగా.. అది డారిల్ మిచెల్‌కు బలంగా తాకింది. దాంతో అతను తీవ్ర ఆగ్రహానికి గురవ్వగా.. మైదానంలో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకొని డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పగా.. ఫీల్డ్ అంపైర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మందలించాడు. ఆ ఓవర్ ముగిసిన వెంటనే డారిల్ మిచెల్‌కు అర్ష్‌దీప్ సింగ్ క్షమాపణలు చెప్పాడు.

అయితే ఈ విజయానంతరం బ్రాడ్‌కాస్టర్ హోస్ట్ హర్షా భోగ్లే.. ఈ గొడవ గురించి ఆరా తీయగా.. అర్ష్‌దీప్ సింగ్ వివరణ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగా బంతిని విసరలేదని స్పష్టం చేశాడు. 'డారిల్ మిచెల్‌కు నేను క్షమాపణలు చెప్పాను. నేను బంతిని విసిరినప్పుడు అది రివర్స్ స్వింగ్ అయ్యి అతనికి తగిలింది. ఉద్దేశపూర్వకంగా అతనిపైకి బంతిని విసరలేదు. ప్రస్తుతం ఈ విజయం చాలా గొప్పగా అనిపిస్తోంది. కానీ ఈ భావోద్వేగం పూర్తిగా అర్థం కావడానికి మరో 2 నుంచి 4 రోజులు పడుతుంది.
ఈ జట్టులో మ్యాచ్ విన్నర్లు చాలా మంది ఉన్నారు. ఈ విజయం మా అందరికీ ఒక తీపి జ్ఞాపకం. ఒక బౌలర్‌గా మా పాత్ర ఏంటంటే.. మేము 250 పరుగులు చేస్తే వారిని 250 లోపు కట్టడి చేయాలి. ఒకవేళ మొదట బౌలింగ్ చేస్తే వారిని వీలైనంత తక్కువ స్కోరుకే పరిమితం చేయాలి.'అని విజయంపై అర్ష్‌దీప్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు.