మహిళల వన్డే ప్రపంచకప్ విజేత, తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీ చరణికి ఏపీ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. గ్రూప్-1 ఉద్యోగంతో పాటు రూ. 2.5 కోట్లు క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. కడపలో నివాస స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ వివరాలను సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశం అనంతరం శ్రీచరణి మీడియాకు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌తో పాటు తెలుగు క్రికెట్ అభిమానులకు శ్రీ చరణి కృతజ్ఞతలు తెలిపింది. చంద్రబాబు నాయుడితో జరిగిన సమావేశ వివరాలను మీడియాతో పంచుకుంది. ప్రపంచకప్ ప్రదర్శనపై టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ ప్రశంసలు సంతోషాన్నిచ్చాయని తెలిపింది.

'ముందుగా ఏసీఏకు ధన్యావాదాలు. వారి ప్రోత్సాహంతోనే నేను ఈ గొప్ప విజయంలో భాగమయ్యాను. మా జట్టుకు మద్దతుగా నిలిచిన ఆంధ్ర అభిమానులకు కృతజ్ఞతలు. ఫలితంతో సంబంధం లేకుండా నా పని నేను చేసుకోను పోయాను. ఈ విజయంతో ఆగిపోవద్దు. ఇంకా సాధించాలని, ఆ సత్తా నీకు ఉందని సీఎం సర్ చెప్పారు. గ్రూప్-1 ఉద్యోగంతో పాటు రూ. 2.5 కోట్లు క్యాష్ ప్రైజ్, కడపలో నివాస స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.
నన్ను నమ్మి ప్రోత్సహించడం సంతోషంగా ఉంది. ఏసీఏ సహకారం వల్ల నా క్రికెట్ జర్నీలో నేను పెద్దగా కష్టాలు పడలేదు. ప్రొఫెషనల్ క్రికెట్ జర్నీలో ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం నాకు దక్కింది. నారా లోకేష్ అండగా ఉన్నారు. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. ఎన్నో ఒడిదొడుకుల తర్వాత ఆశించిన ఫలితం తగ్గడంతో జట్టు మొత్తం భావోద్వేగానికి గురయ్యాం.'అని శ్రీచరణి చెప్పుకొచ్చింది.
అంతకుముందు శ్రీ చరణికి ఏపీ సర్కార్ ఘన స్వాగతం పలికింది. స్వరాష్టానికి చేరుకున్న శ్రీ చరణికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఏసీఏ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శ్రీచరణి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడిని శ్రీచరణి, మిథాలీ రాజ్ కలిసారు. ఈ సందర్భంగా శ్రీచరణిని చంద్రబాబు అభినందించారు. ఆమె ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడిన చంద్రబాబు శాలువాతో సత్కరించారు.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో 21 ఏళ్ల శ్రీ చరణి అదరగొట్టింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచింది.