భారత మహిళా క్రికెటర్, తెలుగు తేజం నల్లపురెడ్డి శ్రీ చరణికి ఏపీ సర్కార్ ఘన స్వాగతం పలికింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజయానంతరం స్వరాష్టానికి చేరుకున్న శ్రీ చరణికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, సవితతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఏసీఏ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శ్రీచరణి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుష్ప గుచ్చంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడిని శ్రీచరణి, మిథాలీ రాజ్ కలిసారు. ఈ సందర్భంగా శ్రీచరణిని చంద్రబాబు అభినందించారు. ఆమె ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడిన చంద్రబాబు శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్ విజయంతో భారత మహిళా క్రికెటర్లు దేశంలోని మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు. వరల్డ్ కప్ విశేషాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌తో శ్రీ చరణిని పంచుకుంది. ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీ చరణికి ఏపీ సర్కార్ భారీ బహుమతి ప్రకటించే అవకాశం ఉంది. మరికొద్ది క్షణాల్లో క్యాష్ ప్రైజ్‌పై అధికారిక ప్రకటన రానుంది.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో 21 ఏళ్ల శ్రీ చరణి అదరగొట్టింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది. ఈ 9 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ మినహా.. ప్రతీ మ్యాచ్‌లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్, ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసింది. ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచింది.
వన్డే ప్రపంచకప్ ముందే భారత మహిళల జట్టుతో నారా లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమయంలోనే శ్రీ చరణి క్రికెట్ జర్నీ గురించి లోకేష్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కాబట్టి ఆమెకు భారీ బహుమతే దక్కుతుందని ఏసీఏ వర్గాలు భావిస్తున్నాయి.