భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తీసుకొచ్చిన 'ఫ్యామిలీ రూల్'ను టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుబట్టిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులతో కాకుండా గదిలో ఒంటరిగా కూర్చోని ఏడవాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కోహ్లీకి మద్దతుగా కొందరు నిలిస్తే మరికొందరు అతన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని ఉద్దేశిస్తూ అనుష్క శర్మ చేసిన సుదీర్ఘ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ, బీసీసీఐ పేరును ప్రస్తావించకుండా తనదైన శైలిలో రాసుకొచ్చిన ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
'నీకు తెలిసిన ప్రతీ ఒక్కరి మనసులో నీ గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు ఎవరినైతే నీలా చూస్తావో వారే నీ కోసం ఉంటారు. వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు. నిన్ను కలిసే వారు.. నీతో పరిచయం ఉన్నవారు.. చివరకు రోడ్లపై నిన్ను చూసిన వారు కూడా.. నీ గురించి వారిలో సొంత అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. చివరకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా నువ్వు ఒకేలా కనిపించవు. ప్రజలకు నువ్వు వెయ్యి రకాలు కనిపించవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కో రూపంగా ఉన్నా.. అందిలోనూ నువ్వే ఉంటావ్. అయితే ఆ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇంకొకరివి కాలేవు'అని అనుష్క శర్మ రాసుకొచ్చింది.

ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియా ఘోరంగా వైఫల్యమైన నేపథ్యంలో బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌లో సమూల మార్పులు చేసేందుకు 10 పాయింట్లతో కూడిన రూల్స్ ను రూపొందించి, అవి కచ్చితంగా పాటించాలని ఆటగాళ్లను ఆదేశించింది. ఈ రూల్స్‌లో ఆటగాళ్లతో కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆంక్షలు విధించడం కూడా ఉంది. సుదీర్ఘమైన విదేశీ పర్యటనలకు మాత్రమే కుటుంబ సభ్యులను రెండు వారాలే అనుమతించాలని పేర్కొంది. తక్కువ వ్యవధి పర్యటనలకు కుటుంబ సభ్యులు అవసరం లేదని పేర్కొంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ నిబంధనను తప్పుబడుతూ.. కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'మనకు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులను కలిస్తే ఎంతో ఊరట లభిస్తోంది. ఆ సమయంలో వారి మద్దతు మనందరికి తప్పనిసరిగా కావాలి. దీని గురించి కొంతమందికి వివరించడం కూడా చాలా కష్టం. ఈ విషయం తెలియని వ్యక్తులు కూడా.. క్రికెటర్లను కుటుంబాలకు దూరంగా ఉంచాల్సిన అవసరముందని అంటున్నారు. అది నన్ను కాస్త నిరాశకు గురి చేస్తోంది. అయినా పర్యటనలో ఉన్నప్పుడు ఆటలో రాణించలేకపోయినా ఆటగాడు ఒంటరిగా కూర్చోవడానికి ఇష్టపడడు. ఆట అనేది ఓ బాధ్యత. దాన్ని పూర్తి చేశాకే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచిస్తాం. నేనైతే బయటకు వెళ్లి నా ఫ్యామిలీతో గడిపే సమయాన్ని, అవకాశాలను ఏ మాత్రం వదులుకోను'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.