అన్షుల్ కంబోజ్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు అన్షుల్ కంబోజ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ గాయాలతో బాధపడుతుండటంతో ముందు జాగ్రత్తగా ఈ హర్యానా పేసర్‌ను జట్టులోకి తీసుకుంది. దాంతో ఈ యువ పేసర్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
అన్షుల్ కంబోజ్ 2000 డిసెంబర్ 6న హర్యానాలోని కర్నాల్ జిల్లాలో జన్మించాడు. అతనిది ఓ సాధారణ వ్యవయసాయ కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయమే చేస్తారు. చిన్నతనం నుంచే అన్షుల్‌కు క్రికెట్ అంటే ఇష్టం. కొడుకు ఇష్టానికి తగ్గట్లు తల్లిదండ్రులు అతన్ని ప్రోత్సహించారు. స్థానికి మైదానాల్లోనే ఆటను ప్రారంభించిన అన్షుల్ కంబోజ్.. కర్నాల్‌లోని రానా బ్రదర్స్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో బీసీసీఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో అన్షుల్ మరింత రాటు దేలాడు.

దేశవాళీ క్రికెట్‌లో హర్యానాకు ఆడుతున్న అన్షుల్ కంబోజ్.. గతేడాది జరిగిన రంజీ ట్రోఫీలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తద్వారా రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. గతంలో ప్రేమాంగ్సు ఛటర్జీ(1956-57), ప్రదీప్ సోమసుందరం(1985-86) మాత్రమే ఈ ఫీట్ సాధించారు. గత రంజీ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన అన్షుల్ 34 వికెట్లు పడగొట్టాడు.
రంజీ ట్రోఫీలో సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన అన్షుల్ కంబోజ్.. ఐపీఎల్ 2025 సీజన్‌తో కోటీశ్వరుడిగా మారాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఈ హర్యానా పేసర్‌ను చెన్నై సూపర్ కింగ్స్.. రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసింది. 8 మ్యాచ్‌లు ఆడిన అన్షుల్ కంబోజ్..8 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3/13 అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.
దేశవాళీ క్రికెట్‌లో అన్షుల్ కంబోజ్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. విజయ్ హజారే ట్రోఫీ 2023-24లో హర్యానా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల్లో 3.58 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. 30 టీ20ల్లో 19.85 సగటుతో 28 వికెట్లు పడగొట్టాడు. 25 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 20.20 సగటుతో 40 వికెట్లు తీసాడు. 24 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22.89 సగటుతో 79 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఏ తరఫున రెండు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగి ఉండటం అతని అదనపు బలం. బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌తో అన్షుల్ కంబోజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది.