మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్లో భారత్ గెలవాలంటే స్మృతి మంధాన రాణించాలని మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడింది. ఇదే టోర్నీలో ఆసీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో స్మృతి మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, కానీ కీలకమైన సమయంలో అనవసర షాట్‌తో వికెట్ పారేసుకొని మూల్యం చెల్లించుకుందని గుర్తు చేసింది. మరోసారి అలాంటి తప్పిదం చేయకుండా జాగ్రత్తగా ఆడాలని సూచించింది.
పాయింట్స్ టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆసీస్‌తో గురువారం నవీముంబై వేదికగా జరగనున్న సెమీఫైనల్లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ చేధించింది. అంతేకాకుండా ఆసీస్ ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. దాంతో ఆసీస్‌ను భారత్ ఓడించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ క్రమంలోనే ఓ ఛానెల్‌తో మాట్లాడిన అంజుమ్ చోప్రా.. స్మృతి మంధాన ఏ తప్పిదం చేయకుండా రాణిస్తే భారత్‌కు విజయవకాశాలు ఉంటాయని చెప్పింది. ఆస్ట్రేలియా రెండో ఛాన్స్ ఇవ్వదని, వచ్చిన అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ' ఆస్ట్రేలియాతో లీగ్ మ్యాచ్‌లో స్మృతి మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. సెంచరీ చేసేలా కనిపించింది. కానీ అనవసర షాట్‌తో వికెట్ కోల్పోయింది. స్వీయ తప్పిదంతో వికెట్ సమర్పించుకుంది. సెమీఫైనల్లో మంధాన ఇలాంటి తప్పిదం చేయవద్దు.
ప్రపంచకప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో స్మృతి మంధాన ఆడిన ఇన్నింగ్స్‌లు అందరికీ గుర్తున్నాయి. ఆ స్థానానికి చేరుకోవడానికి ఆమె చాలా కష్టపడింది. కాబట్టి మంధాన ఆ ఫామ్ కొనసాగిస్తూ.. సెమీ ఫైనల్లో రాణిస్తుందనుకుంటున్నా.'అని అంజుమ్ చోప్రా పేర్కొంది.
టీమిండియా మరో ఓపెనర్ ప్రతీక రావల్ బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడింది. సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ప్రతీకా రావల్ గాయంతో జట్టుకు దూరమైంది. ఆమె స్థానంలో షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. సమష్టిగా రాణిస్తేనే ఆస్ట్రేలియాపై టీమిండియాకు విజయం దక్కనుంది. ప్రతీకా రావల్ గైర్హాజరీతో మంధానపై మరింత బాధ్యత పెరిగింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లు ఆడిన మంధాన 365 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతోంది. ఇదే టోర్నీలో ఆస్ట్రేలియాపై 80, ఇంగ్లండ్‌పై 88 పరుగులు చేసింది. అదే జోరును ఫైనల్లో కొనసాగించి సెంచరీ సాధిస్తే టీమిండియాకు తిరుగుండదు. కానీ ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టును ఓడించాలంటే సమష్టిగా రాణించాలి.