టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు వారం వ్యవధిలో రిటైర్మెంట్ ప్రకటించడం భారత జట్టుకు పెద్ద లోటు అని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు తప్పుకోవడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుందన్నాడు.
అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఘన వీడ్కోలుకు అర్హులని, అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించాలని బీసీసీఐని కోరాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. రోహిత్, కోహ్లీ వారం వ్యవధిలోనే ఆటకు అల్విదా ప్రకటించారు. కోహ్లీ, రోహిత్‌ల రిటైర్మెంట్‌పై ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన కుంబ్లే.. వారి అనుభవం ఇంగ్లండ్ పర్యటనలో ఉపయోగపడేదని చెప్పాడు.

'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలకడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇద్దరు గొప్ప ఆటగాళ్లు వారం రోజుల వ్యవధిలోనే టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించడం భారత జట్టుకు పెద్ద లోటు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు తప్పుకోవడం మరింత షాక్‌కు గురి చేసింది. అయితే ఈ ఇద్దరికి మైదానంలో ప్రేక్షకుల మధ్య ఘన వీడ్కోలు దక్కాల్సింది. ఆ అవకాశాలను బీసీసీఐ పరిశీలించాలి. ఇది చాలా నిశ్శబ్ద నిష్క్రమణ. ప్రతి ఆటగాడు తాను అనుకున్న విధంగా ఆట నుంచి నిష్క్రమించాలనుకుంటాడు. అయితే ఆటగాళ్ల వీడ్కోలు మైదానంలో జరిగితే బాగుటుంది. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే జరిగింది.
రోహిత్ శర్మ కొన్నాళ్లు టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ సక్సెస్‌ఫుల్ సారథుల్లో ఒకడు. ఇంగ్లండ్ పర్యటనలో ఈ ఇద్దరి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. సెలెక్టర్లు కూడా వారిని జట్టులో కొనసాగించాలనుకున్నారు.'అని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనతో డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ప్రారంభం కానుంది. జూన్‌లో ఐదు టెస్ట్‌ల కోసం టీమిండియా.. ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.