టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తృటిలో మూడో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. వెస్టిండీస్‌తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన జైస్వాల్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌటయ్యాడు. 25 పరుగుల దూరంలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. రెండో రోజ ఆట ఆరంభంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
జైడన్ సీల్స్ వేసిన 92వ ఓవర్ రెండో బంతిని మిడాఫ్ దిశగా ఆడిన జైస్వాల్ క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. అయితే జైస్వాల్‌కు మూమెంటమ్ ఇచ్చిన శుభ్‌మన్ గిల్.. బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడం గమనించి ఆగిపోయాడు. మరోవైపు ఇది చూసుకోకుండా యశస్వి జైస్వాల్ సగం క్రీజును ధాటేసాడు. శుభ్‌మన్ గిల్ రాకపోవడాన్ని గమనించి యూటర్న్ తీసుకొని వెనక్కి పరుగెత్తాడు. కానీ బంతిని అందుకున్న వికెట్ కీపర్ ఎలాంటి తప్పిదం చేయకుండా బెయిల్స్ పడేసాడు.

దాంతో జైస్వాల్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అది తన కాల్ కదా? అంటూ శుభ్‌మన్ గిల్‌పై అసహనం వ్యక్తం చేస్తూ జైస్వాల్ మైదానం వీడాడు. శుభ్‌మన్ గిల్ పరుగెత్తి ఉంటే రన్ వచ్చేదని, ఒకవేళ ఔటైనా జైస్వాల్ అయ్యేవాడని నెటిజన్లు కామెంట్ చేశారు. గిల్ స్వార్థం కారణంగా జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్సైందని మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే.. శుభ్‌మన్ గిల్ తప్పిదం ఏం లేదని స్పష్టం చేశాడు. యశస్వి జైస్వాల్ అనవసర పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడని చెప్పాడు. లంచ్ బ్రేక్ సమయంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన కుంబ్లే.. స్వీయ తప్పిదంతోనే జైస్వాల్ డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడని అభిప్రాయపడ్డాడు.
'ఇదొక అనూహ్య పరిణామం. జైస్వాల్ వంటి ప్రతిభావంతమైన ఆటగాడు ఇలాంటి తప్పిదం చేస్తాడా? అని ఎవరైనా అనుకుంటారా? తాను మంచి షాట్ ఆడానని జైస్వాల్ భావించి ఉంటాడు. ఏదేమైనా పరుగుకు ప్రయత్నించింది జైస్వాల్. ఇందులో నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ తప్పేమీ లేదు. ఎందుకంటే జైస్వాల్ నేరుగా మిడాఫ్ ఫీల్డర్ చేతిలోకి బంతి కొట్టాడు. ఆ సమయంలో పరుగు తీయడానికి ఏ మాత్రం అవకాశం లేదు.'అని కుంబ్లే పేర్కొన్నాడు.