
ఆక్సిజన్ లేక అల్లాడుతుంటే..
ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆండ్రూ టై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక రోగులు ఇబ్బంది పడుతున్న విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021 సీజన్ కొనసాగించడం సమంజసమేనా? అనే ప్రశ్న తనకు తట్టిందన్నాడు. 'ఆటగాళ్ల భద్రతా కోణంలో ప్రస్తుతానికి మేమంతా సేఫ్‌గానే ఉన్నాం. ఇది ఇలానే కొనసాగుతుందా? అలాగే భారత్‌లో రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరకని కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు, కంపెనీలు, ప్రభుత్వాలు వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తున్నాయి.?'అని ఆండ్రూ టై ప్రశ్నించాడు.

ఎంటర్‌టైన్‌మెంట్ కాదనలేను..
అలాగే భారత్‌లో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్, ఈ కఠిన పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారా ప్రజలకు అందిస్తున్న మానసిక ఉల్లాసాన్ని తాను అర్థం చేసుకోగలనని తెలిపాడు. 'క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందనే విషయం నాకు తెలుసు. ముఖ్యంగా ఈ కఠిన పరిస్థితుల్లో ప్రజలకు అదెంతో మేలు చేస్తుంది. ఈ కారణంతోనే వారు ఐపీఎల్‌ను కొనసాగిస్తుండవచ్చు. కానీ అందరూ ఇదే అభిప్రాయంతో ఉంటారని మాత్రం నేను అనుకోవడంలేదు. నేను అన్నీ కోణాల్లో నుంచి అందరి అభిప్రాయాలను గౌరవిస్తాను. 'అని ఆండ్రూ టై తెలిపాడు. రాజస్థాన్ టీమ్ తరఫున అతను ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు.

తప్పుకున్న అశ్విన్..
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్, టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఐపీఎల్ 2021 సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం అతను ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తమ కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారని, వారికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
పరిస్థితులు చక్కడిన తర్వాత అవకాశం ఉంటే మళ్లీ మైదానంలోకి దిగుతానని స్పష్టం చేశాడు. కష్ట సమయంలో అతనికి పూర్తి అండగా నిలబడతామని ఢిల్లీ క్యాపిటల్స్ పేర్కొంది. అశ్విన్ కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రార్థిస్తోందని, త్వరలోనే అందరూ కోలుకుంటారని ఆకాంక్షించింది. అదే విధంగా.. అశ్విన్ జట్టుతో చేరాలని భావించినపుడు తప్పకుండా అతడు తిరిగిరావొచ్చని పేర్కొంది.

పట్ట పగ్గాల్లేకుండా..
దేశంలో కరోనా మహమ్మారి పట్టపగ్గాలేకుండా విజృంభిస్తోంది. వైరస్ సంక్రమణ రోజుకొక కొత్త రికార్డును అధిగమిస్తోంది. దేశంలో వరుసగా మూడవ రోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం ఒక్కరోజే భారత్‌లో రికార్డు స్థాయిలో 3,46,786 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో మరేదేశంలోనూ లేనంతగా ఒకేరోజు (బుధవారం) 3.14 లక్షల అత్యధిక కేసులతో రికార్డులకెక్కిన భారత్ వరుసగా నాలుగోరోజూ ఈ పరంపరను కొనసాగించింది. దీనితో భారతదేశంలో మూడు రోజుల్లోనే 12.94 లక్షల కొత్త కేసులు వచ్చాయి.


Click it and Unblock the Notifications
