Andrew Strauss: లార్డ్స్ ఓటమి మిగిలిన సిరీస్‌లో ఇంగ్లండ్‌ను వెంటాడుతుంది!

లండన్: లార్డ్స్ టెస్ట్ ఓటమి భారత్‌తో మిగిలిన సిరీస్‌లో ఇంగ్లండ్‌ను వెంటాడుతుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ అన్నాడు. టీమిండియా చేతిలో ఓడిపోయిన తీరు ఇంగ్లండ్‌ను తీవ్రంగా గాయపరిచిందన్నాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడటంతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంపై ప్రభావం పడుతుందున్నాడు. ఇక టీమ్ టాపార్డర్‌లో మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు.
ముఖ్యంగా ఇంగ్లండ్ ఓపెనర్లు దారుణంగా విఫలమవుతున్నారని, సొంతగడ్డపై డకౌటవ్వడం విచారకరమన్నాడు. జోరూట్ ఒక్కడిపై భారతం పెడితే కుదరదని చెప్పాడు. ఇటీవల ముగిసిన లార్డ్స్ టెస్ట్‌లో భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితంపై స్పందించిన స్ట్రాస్ భారత్ ప్రదర్శనను కొనియాడాడు.

గెలిచే మ్యాచ్‌లో..
'రెండో టెస్టులో చివరి వరకు ఇంగ్లండ్ ఫేవరెట్‌గా కనబడింది. కానీ, ఆఖరి రోజు లంచ్ బ్రేక్ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మరోసారి టాపార్డర్ కుప్పకూలింది. త్వరగా వికెట్లు పడటం మిడిలార్డర్‌ను తీవ్ర ఒత్తిడిలో పడేసింది. పైగా వారిని ఔట్ చేసేందుకు టీమిండియాకు చాలినన్ని ఓవర్లు లభించాయి. ఇంగ్లండ్ ఆట మరి దారుణంగా సాగింది' అని స్ట్రాస్ అన్నాడు.
ఐదు టెస్టుల సిరీసులో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లేందుకు కోహ్లీసేనకు పూర్తిగా అర్హత ఉందని స్ట్రాస్ తెలిపాడు. 'టీమిండియాతో ప్రతి సిరీసు, ప్రత్యేకించి కోహ్లీ ఉన్నప్పుడు పండగే! మనం మ్యాచ్ నుంచి మరేం ఆశించక్కర్లేదు. ఇదో అద్భుతమైన టెస్టు క్రికెట్. కోహ్లీసేన అద్భుతంగా ఆడింది. పరిస్థితులు మార్చేసింది. గెలిచేందుకు వారు అన్నీ చేశారు. ఈ ఫలితంతో మిగిలిన సిరీసులో ఇంగ్లండ్ అవకాశాలు దెబ్బతింటాయి.' అని స్ట్రాస్ వివరించాడు.

మార్పులు అనివార్యం..
లార్డ్స్ టెస్ట్ వైఫల్యం నేపథ్యంలో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని స్ట్రాస్ నొక్కి చెప్పాడు. 'డామ్ సిబ్లీ అసలు ఫామ్‌లో కనిపించడం లేదు. పరుగులేమీ చేయకుండా సొంతగడ్డపై ఇంగ్లండ్ ఓపెనర్లు డకౌట్ అయ్యారు. ఇది అత్యంత విచారకరం. రోరీ బర్న్స్ సైతం పరుగులు చేయడం లేదు.
త్వరగా వికెట్లు పడితే జో రూట్ ఒక్కడే ఏమీ చేయలేడు. జానీ బెయిర్ స్టో ఒక్కడే ఇంగ్లండ్‌ను ఆదుకునేలా కనిపించాడు. మిగిలిన వాళ్లు దారుణంగా విఫలమయ్యారు. మూడో టెస్టులో మార్పులు చేయాల్సిందే. లేకుంటే కష్టం'అని స్ట్రాస్ అభిప్రాయపడ్డాడు.

అద్భుత విజయం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 364 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(129), రోహిత్ శర్మ(83) రాణించారు. ఆ తర్వాత ఇంగ్లండ్.. జోరూట్(180) అజేయ సెంచరీతో 391 పరుగులకు ఆలౌటై 27 పరుగులు ఆధిక్యాన్ని అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా 9వ వికెట్‌కు అజేయంగా 89 పరుగులు జోడించి గట్టెక్కించారు. దాంతో భారత్ 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 120 పరుగులకే కుప్పకూలి చిత్తయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications