టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, తెలుగు తేజం హనుమ విహారిపై ఆంధ్ర జట్టు యువ ప్లేయర్, వికెట్ కీపర్ కేఎన్ పృథ్వీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హనుమ విహారీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు తనను తీవ్రంగా అవమానించారని ఆ జట్టు సారథ్య బాధ్యతలతో పాటు ఆంధ్ర టీమ్‌కు హనుమ విహారి గుడ్‌బై చెప్పాడు.
సోషల్ మీడియా వేదికగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశాడు. ఓ రిజర్వ్ ప్లేయర్‌ను తిట్టానని, తనను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారని ఆరోపించాడు. తక్షణమే ఆంధ్ర టీమ్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర ఓటమిపాలైంది.

ఈ ఓటమి అనంతరం అంధ్ర టీమ్‌కు గుడ్‌బై చెబుతూ విహారి ఓ పోస్ట్ పెట్టాడు. 'ఈ సీజన్ రంజీ ట్రోఫీలో బెంగాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు నేనే సారథిగా వ్యవహరించాను. ఆ మ్యాచ్ సందర్భంగా జట్టులోని 17వ ప్లేయర్‌ను నేను మందలించాను. అతనిపై కాస్త గట్టిగా అరిచాను. దానికి బాగా హర్ట్ అయిన సదరు ప్లేయర్.. రాజకీయ నాయకుడైన తన తండ్రి ద్వారా నాపై అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు.
నాపై చర్యలు తీసుకునేలా అతని తండ్రి అసోసియేషన్‌పై ఒత్తిడి చేశాడు. గతేడాది ఫైనలిస్ట్ అయిన బెంగాల్‌పై మేం 410 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాం. కానీ అసోసియేషన్ అధికారులు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నన్ను కోరారు. నా నుంచి ఎలాంటి తప్పిదం లేకున్నా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించారు.
వ్యక్తిగతంగా సదరు ఆటగాడిని నేను దూషించలేదు. కానీ అసోసియేషన్ మాత్రం నా కంటే సదరు ప్లేయర్ గొప్పవాడని భావించింది. జట్టు కోసం శరీరమంతా గాయాలు చేసుకొని.. లెఫ్టాండ్ బ్యాటింగ్ చేసినా.. గత ఏడేళ్లుగా ఐదు సార్లు నాకౌట్ చేర్చినా.. 16 అంతర్జాతీయ టెస్ట్‌లు ఆడినా.. అసోసియేషన్ నాకు కనీస గౌరవం ఇవ్వలేదు.
ఎంతో అవమానకరంగా ఫీలైనా.. ఆటపై ఉన్న గౌరవంతో ఈ సీజన్ మొత్తం ఆడాను. జట్టు కంటే ఆ ప్లేయర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని నేను సహించలేకపోతున్నాను. అందుకే ఆంధ్ర జట్టుకు మళ్లీ ఆడవద్దని నిర్ణయించుకున్నాను'అని హనుమ విహారి తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. తన పోస్టులో సదరు ప్లేయర్ పేరును హనుమ విహారి ప్రస్తావించలేదు. కానీ యువ ప్లేయర్ అయిన పృథ్వీ రాజ్ హనుమ విహారి ఆరోపణలపై స్పందించాడు.
'అందరీకి హలో.. హనుమ విహారి ఆరోపించిన ఆటగాడిని నేనే. నా గురించి మీరు విన్నదంతా అసత్యం. ఆట కంటే ఎవరూ కూడా గొప్ప కాదు. అయితే అన్నింటికంటే నా ఆత్మగౌరవం చాలా ముఖ్యమైనది. ఎలాంటి వేదికలోనైనా వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం ఆహ్వానించదగినది కాదు. ఆ రోజు ఏమైందో జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు.
నువ్వు ఇంతకు మించి ఏమి పీకలేవురా.. ఛాంపియన్. నీకు కావాల్సిన సానుభూతి గేమ్స్ ఆడుకో'అని పృథ్వీ రాజ్ ఘాటుగా బదులిచ్చాడు. ఆంధ్రకు చెందిన పృథ్వీ రాజ్ 24 ఏళ్ల యువ వికెట్ కీపర్. ఇంత వరకు ఫస్ట్ క్లాస్ గేమ్ ఆడలేదు. ఆంధ్ర జట్టు తరఫున ఒకే ఒక లిస్ట్ ఏ గేమ్ ఆడాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.