
న్యూఢిల్లీ: ఆసియాకప్ 2022లో విజేతగా నిలిచిన శ్రీలంక జట్టుపై భారత ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీలంక ఆడిన తీరు తనను ఆకట్టుకుందని, సూపర్ స్టార్లు, సెలబ్రిటీలు లేకున్నా టీమ్ వర్క్‌తో విజయాలు సాధించవచ్చని నిరూపించందని కొనియాడారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆసియాకప్ 2022 బరిలోకి దిగిన శ్రీలంక.. అసాధారణ ప్రదర్శనతో టైటిల్ ఎగురేసుకుపోయి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌ను 23 పరుగులతో మట్టికరిపించి 6వ సారి ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది. శ్రీలంక విజయాన్ని ఉద్దేశిస్తూ ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ అభిమానులను ఆలోచింపజేస్తోంది.'శ్రీలంక సాధించిన విజయం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇది పాకిస్థాన్ ఓటమి వల్ల వచ్చింది కాదు. టీమ్ స్పోర్ట్స్‌లో విజయం సెలబ్రిటీలు, సూపర్ స్టార్‌లు ఉన్నారనేదాని కంటే.. కలిసికట్టుగా ఆడటంపైనే ఆధారపడి ఉంటుంది. శ్రీలంక విజయం ఇదే విషయాన్ని మనకు గుర్తు చేస్తోంది'అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ చేతిలో ఓడి ఏమాత్రం పోటీలో లేనట్లు కనిపించిన శ్రీలంక.. ఆ తర్వాత ఒక్కటీ ఓడలేదు. బంగ్లాదేశ్‌ను ఓడించి సూపర్ 4లో అడుగుపెట్టిన ఆ జట్టు.. తన కంటే బలమైన భారత్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్ చేరింది. ఇక ఫైనల్లో టాస్ ఓడినా..58 పరుగులు 5 వికెట్లు కోల్పోయినా... సమష్టిగా రాణించిన సంచలన విజయాన్నందుకుంది. సూపర్ బ్యాటింగ్‌తో భానుక రాజపక్స, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హసరంగ డిసిల్వా, మెరుపు బౌలింగ్‌తో ప్రమోద్ మదుషాన్ లంకను గెలిపించారు. అసాధారణ ఫీల్డింగ్‌తో పాక్ బ్యాటర్లకు లంక ముచ్చెమటలు పట్టించింది.