జీవితం అందరికి మరోక ఛాన్స్ ఇస్తుందని పెద్దలు తరుచూ చెబుతుంటారు. టీమిండియా మహిళల హెడ్ కోచ్ అమోల్ ముజుందార్ జీవిత కథ వింటే ఇది నిజమే అనిపిస్తోంది. మనోడి పట్టుదలకు బ్యాడ్ లక్ కూడా భయపడింది. ఆటగాడిగా 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దక్కని విజయం, అదృష్టం.. కోచ్‌గా వరించింది.
పాపం మనోడి బ్యాడ్ లంక్ ఎంత అంటే.. శారదాశ్రమం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సచిన్, వినోద్ కాంబ్లీ 664 పరుగుల వరల్డ్ రికార్డ్ నమోదు చేసినప్పుడు, పాడ్స్ కట్టుకొని రెండు రోజుల పాటు బ్యాటింగ్ కోసం వేచి చూసిన తదుపరి బ్యాటర్ అమోల్ ముజుందారే.
భారత అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ వైస్ కెప్టెన్.. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీతో కలిసి భారత్-ఏకు కూడా ఆడాడు. కానీ ముజుందార్‌కు అదృష్టం కలిసి రాలేదు. సచిన్, వినోద్ కాంబ్లీ సహచరుడిగా దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్ది పరుగులు చేసినా.. శతకాలు బాదినా టీమిండియాకు ఆడే అవకాశం దక్కలేదు. ఎందుకంటే అప్పటికే జట్టులో అద్భుతమైన టాప్-5 బ్యాటర్లు ఉండటం. అవకాశాలు ఇచ్చే గాడ్ ఫాదర్ ముజుందార్‌కు లేకపోవడం.

దాంతో సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్, గంగూలీని దాటేసి జట్టులోకి రాలేకపోయాడు. రంజీల్లో 11 వేల పరుగులు, 30 సెంచరీలు సాధించినా.. అవకాశం దక్కలేదు. కానీ అతను మాత్రం పట్టు వదల్లేదు. దాదాపు 38 ఏళ్ల వయసు వరకు రంజీ క్రికెట్ ఆడాడు. ఒకే ఒక్క ఛాన్స్ కోసం నిరీక్షించాడు. కానీ బ్యాడ్ లక్ అతన్ని వెంటాడింది.
ఆటగాడిగా అవకాశం దక్కకున్నా అతను నిరాశ చెందలేదు. కోచ్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత మహిళల కోచ్‌గా నియమితులయ్యాడు. ఇక్కడ కూడా అతనికి విజయం సులువుగా దక్కలేదు. మహిళల వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా జట్టును సిద్దం చేసిన ముజుందార్‌కు మళ్లీ బ్యాడ్ లక్ వెంటాడింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓడి నిరాశలోకి కూరుకుపోయింది. కీలక ఓపెనర్ ప్రతీకా రావల్ గాయంతో జట్టుకు దూరమైంది. కానీ కోచ్‌గా ముజుందార్ డీలా పడలేదు.
తన మాటలతో జట్టు ఆటగాళ్లను రెచ్చగొట్టాడు. కోచ్‌గా గెలవాలనే కసిని రగిల్చాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వెటరన్ ఓపెనర్ షెఫాలీ వర్మను జట్టులోకి తీసుకొచ్చాడు. సీన్ కట్ చేస్తే సెమీస్‌లో పటిష్టమైన ఆసీస్‌ను భారత్ అసాధారణ ప్రదర్శనతో మట్టికరిపించింది. ఈ విజయం అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఫైనల్లో కోచ్ ముజుందార్ పెట్టుకున్న నమ్మకాన్ని షెఫాలీ నిలబెట్టుకుంది.
అద్భుత బ్యాటింగ్‌తో పాటు ఔటాఫ్ సిలబస్‌లా దూసుకొచ్చి బౌలింగ్‌లో చెలరేగింది. ఇంకేముందు ముజుందార్ బ్యాడ్ లక్ తోక ముడిచింది. ఆటగాడిగా దక్కని గొప్ప విజయం కోచ్‌గా అతని ముందు మోకారిల్లింది. ప్రపంచ క్రికెట్‌లో వరల్డ్‌కప్ అందించిన అరుదైన కోచ్‌ల జాబితాలో ముజుందార్ పేరు చేరింది. గెలుపు అందిన క్షణం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వచ్చి కోచ్ ముజుందార్ కాళ్లపై పడింది. ఈ ఒక్క సీన్ అతని విలువ ఏంటో తెలియజేస్తోంది. శభాష్ ముజుందార్.. నీ పట్టుదలకు.. అలుపెరుగని శ్రమకు సలామ్!