అఫ్రిది అందరూ నీలా ఉండరు.. ఒక్కసారే రిటైర్ అవుతారు.. అమిత్ మిశ్రా కౌంటర్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇదే సరైన సమయం అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటిస్తారా? అంటూ నెటిజన్లు అఫ్రిదికి చురకలంటిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఫామ్‌ను చూసి అఫ్రిది ఓర్వలేకపోతున్నాడని, అందుకే రిటైర్మెంట్ తీసుకోమని సలహా ఇస్తున్నాడని మండిపడుతున్నారు. ఇక అఫ్రిది వ్యాఖ్యలపై భారత మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సైతం స్పందించాడు. ట్విటర్ వేదికగా తనదైన శైలిలో అఫ్రిదికి కౌంటరిచ్చాడు.

అందరూ నీలా ఉండరు..
'డియర్ అఫ్రిది.. కొందరు ఒకసారి మాత్రమే ఆటకు వీడ్కోలు పలుకుతారు. కాబట్టి విరాట్ కోహ్లీని ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉంచండి'' అని మిశ్రా ట్వీట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దిమ్మతిరిగిపోయే బదిలిచ్చాడంటూ అమిత్ మిశ్రాను భారత అభిమానులు కొనియాడుతున్నారు. అఫ్రిది రిటైర్మెంట్ తీరును ఉద్దేశించే మిశ్రా ఇలా సెటైరిక్‌గా స్పందించాడు. గతంలో పాక్ తరఫున ఆడేటప్పుడు అఫ్రిది చాలాసార్లు రిటైర్‌మెంట్ ప్రకటనలు చేసి యూటర్న్ తీసుకున్నాడు. కొన్ని రోజులు ఆడటం.. మళ్లీ వీడ్కోలు చెబుతానని చెప్పడం.. ఇలా అఫ్రిది చేసిన సందర్భాలను గుర్తు చేస్తూ అమిత్ మిశ్రా కౌంటర్ ఎటాక్ చేశాడు.

మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ..
ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండి ఆసియా కప్ 2022 బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. గత మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ సెంచరీ కూడా బాదేసాడు. 5 మ్యాచుల్లో 276 పరుగులతో టాప్ స్కోరు చేసిన బ్యాటర్లలో రెండో స్థానంలో నిలిచాడు. అతని కంటే రిజ్వాన్ (6 మ్యాచుల్లో 281 పరుగులు )కేవలం ఐదు పరుగులు మాత్రమే ఎక్కువగా చేశాడు. అయితే రిజ్వాన్ కంటే కోహ్లీ స్ట్రైక్ రేట్ (147.59) అధికం కావడం విశేషం. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ టీ20 ప్రపంచకప్‌లోనూ భారీగా పరుగులు చేయాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.

ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే..
పాకిస్థాన్‌కు చెందిన సమా చానల్‌తో మాట్లాడిన అఫ్రిది.. ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే విరాట్ రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని చెప్పాడు. 'జట్టు నుంచి తప్పించడం వంటి పరిస్థితికి వెళ్లకూడదు. అలాకాకుండా ఉన్నతస్థితిలో ఉన్నప్పుడే రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేస్తే బాగుంటుంది. అయితే ఇది చాలా అరుదుగానే జరుగుతుంటుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఇలా చేయగలిగారు. మరీ ముఖ్యంగా ఆసియా ప్రాంతానికి చెందిన ప్లేయర్లు ఎక్కువగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. అయితే విరాట్ కోహ్లీ కూడా ఇలానే చేస్తాడని భావిస్తున్నా. ఎందుకంటే అతడు కెరీర్‌ను ఏ విధంగా ప్రారంభించాడో.. అలానే ముగింపు కూడా ఉన్నతస్థాయిలోనే ఉండొచ్చు. ఆరంభంలో ఎన్నో కష్టాలను అధిగమించి పైస్థాయికి చేరాడు. అతడొక ఛాంపియన్. తప్పకుండా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే రిటైర్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటాడు'' అని అఫ్రిది తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications