DC vs MI: సెహ్వాగ్ భాయ్.. ఇప్పుడైనా నా జీతం కాస్త పెంచండి! వేడుకున్న అమిత్ మిశ్రా!

చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా మిశ్రా కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ తొలి స్థానంలో ఉన్నాడు. మలింగ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 122 మ్యాచ్‌లాడి 170 వికెట్లు తీయగా.. మిశ్రా 152 మ్యాచ్‌లాడి 164 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడానికి మిశ్రా కేవలం 7 వికెట్ల దూరంలో ఉన్నాడు.

2008లో హ్యాట్రిక్
అద్భుత ప్రదర్శన చేసిన అమిత్ మిశ్రాపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ టోర్నీలో అమిత్ మిశ్రా ఎప్పుడూ నిలకడగా రాణిస్తున్నాడని, అతని వికెట్లే ఈ విషయం చెపుతాయన్నాడు. మిశ్రా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని, తాను ఇకిష్టమైన సహచర ఆటగాళ్లలో అతనొకరు అని వీరూ పేర్కొన్నాడు. సెహ్వాగ్, మిశ్రా 2008లో ఢిల్లీ డేర్‌డేవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఆడారు. మిశ్రా ఐపీఎల్ 2008 సీజన్‌లో హ్యాట్రిక్ సాధించాడు. అప్పుడు వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణను తాజాగా సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు.

నాకిష్టమైన ఆటగాళ్లలో మిశ్రా ఒకడు
'అమిత్ మిశ్రా చాలా ప్రశాంతంగా ఉంటూ ప్రతి ఒక్కరితో శాంతంగా మాట్లాడతాడు. ఎవరితోనైనా తొందరగా కలిసిపోతాడు. అందుకే నాకిష్టమైన సహచర ఆటగాళ్లలో అతడు ఒకడు. అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. మిశ్రా ఐపీఎల్ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. లీగ్‌లో స్పిన్నర్‌గా అత్యధిక వికెట్లు తీసింది మిశ్రానే. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన శైలిలో కాకుండా సాధారణంగా ఆడాడు. అతడు 60-70 పరుగులు సులభంగా చేయగలడు. కానీ మిశ్రా అతడిని బోల్తా కొట్టించాడు' అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

వీరూ భాయ్.. నా జీతం పెంచండి
'అమిత్ మిశ్రా తన మొదటి హ్యాట్రిక్ సాధించినప్పుడు మేం మాట్లాడుకున్న విషయాలు నాకు ఇంకా గుర్తున్నాయి. హ్యాట్రిక్ అనంతరం నీకేం కావాలి? అని అడిగితే.. 'వీరూ భాయ్.. దయచేసి నా జీతం పెంచండి' అని కోరాడు. అప్పుడు కోరిన దానికంటే ఇప్పుడు ఎక్కువ డబ్బును పొందుతున్నాడని భావిస్తున్నా. మిశ్రా మరొక హ్యాట్రిక్ పడగొట్టినా.. ఇప్పుడు జీతం పెంచమని అడగడు' అని క్రిక్‌బజ్‌లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ అన్నాడు. మిశ్రా భారత్ తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. మొత్తంగా 156 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్, భారత్ జట్టు ఏదైనా వికెట్లు తీయడమే మిశ్రాకు తెలిసిన పని.

రోహిత్ అలా ఔట్ అవుతున్నాడు
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఐపీఎల్‌లో 7సార్లు ఔట్ చేయడంపై మ్యాచ్ అనంతరం అమిత్ మిశ్రా స్పందించాడు. 'రోహిత్‌కు బౌలింగ్ వేసేటప్పుడు అతను హిట్టింగ్ చేయకుండా వైవిధ్యమైన బంతులు వేస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతీస్తాను. అందులోనూ నేను వేసే వాటిలో ఎక్కువగా ఫ్లైట్ డెలివరీలు ఉండడంతో రోహిత్ అవుటవుతున్నాడు. అయితే రోహిత్ నా బౌలింగ్‌లో ఏడు సార్లు ఔటయ్యాడన్న విషయం నాకు తెలియదు. అయితే ఈ మ్యాచులో రోహిత్, పొలార్డ్ వికెట్ తీయడం నాకు ప్రత్యేకం. నాలుగు వికెట్లు తీసినందుకు చాలా సంతోషంగా ఉంది' అని మిశ్రా పేర్కొన్నాడు.
KKR vs CSK: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓటమి.. షారుక్ ఖాన్ ఏమన్నాడంటే?
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications