మనసు మార్చుకున్న అంబటి రాయుడు.. రిటైర్మెంట్ వెనక్కి

హైదరాబాద్: తెలుగుతేజం, భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తన రిటైర్మెంట్ విషయంలో మనసు మార్చుకున్నాడు. గురువారం రాయుడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో అతడు మళ్లీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగబోతున్నాడు. రాయుడు ఈ సీజన్‌లో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. వచ్చే నెల 10 నుంచి ఎప్పుడైనా హైదరాబాద్ జట్టుతో చేరడానికి సిద్ధమని రాయుడు తెలిపాడు.

ఆకస్మికంగా రిటైర్మెంట్:
అంబటి రాయుడు గత రెండేళ్లుగా టీమిండియా పరిమిత ఓవర్లలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అంతేకాదు వన్డే ప్రపంచకప్ జట్టు ప్రణాళికల్లో కూడా ఉన్నాడు. అయితే అనూహ్యంగా బీసీసీఐ సెలెక్టర్లు ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన రాయుడు ఆకస్మికంగా గత జులైలో రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. అయితే తిరిగి పరిమిత ఓవర్ల క్రికెట్లోకి రావాలని ఉందని కొద్దిరోజుల ముందు తన మనసులోని మాటలను బయటపెట్టాడు.

రిటైర్మెంట్ వెనక్కి:
అనుకున్నట్లుగానే రాయుడు గురువారం తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. 'నా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా. ఇక అన్ని ఫార్మాట్లో క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. గడ్డుకాలంలో నాకు మద్దతుగా నిలిచి, నాలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని చెప్పిన సీఎస్‌కే యాజమాన్యం, వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్‌లకు ధన్యవాదాలు' అని బీసీసీఐ, హెచ్‌సీఏకు పంపిన లేఖలో రాయుడు పేర్కొన్నాడు.

తిరిగి ఆలోచించా:
'క్రికెట్‌కు రిటైర్మెంట్ పలకాలనే నిర్ణయం ఎంతో భావోద్వేగంతో తీసుకున్నది. ఆ సమయంలో చాలా బాధపడ్డా. అందరూ నాతో మాట్లాడడంతో తిరిగి ఆలోచించా. హైదరాబాద్ తరపున తిరిగి ఆడేందుకు ఏంటో ఉత్సాహంగా ఉన్నా. హైదరాబాద్ జట్టు పూర్తిస్థాయిలో సత్తా చాటేందుకు నా సహకారం అందిస్తా. వచ్చే నెల 10 నుంచి జట్టుతో చేరేందుకు సిద్ధం' అని రాయుడు స్పష్టం చేసాడు. 'రాయుడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. హెచ్‌సీఏ తరపున ప్రాతినిథ్యం వహించేందుకు అతడు అందుబాటులో ఉంటాడు' అని హెచ్‌సీఏ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రపంజన్ మాయ.. తలైవాస్‌పై బెంగాల్ విజయం

ఒక్క టెస్టు మ్యాచ్ ఆడలేదు:
2013లో జింబాబ్వేతో జరిగిన వన్డేతో రాయుడు భారత జట్టులోకి అరంగేట్రం చేసాడు. ఈ ఏడాది రాంచీలో ఆస్ట్రేలియాపై చివరి వన్డే ఆడాడు. 55 వన్డేల్లో 47.05 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 124 నాటౌట్. ఇక.. 6 టీ20లలో 42 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 20. భారత పరిమిత ఓవర్ల జట్లలో కీలక ఆటగాడిగా ఉన్న రాయుడు ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆడలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications