రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని కొనియాడాడు. టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి కోహ్లీ తప్పు చేశాడని, మరో 5-6 ఏళ్లు ఆడే సత్తా అతనికి ఉందని చెప్పాడు. విరాట్ కోహ్లీ ఆడకపోవడం భారత క్రికెట్‌కు తీరని లోటు అని అభిప్రాయపడ్డాడు.
కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొని.. టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌పై ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో షోలో మాట్లాడిన అంబటి రాయుడు.. ప్రశంసల జల్లు కురిపించాడు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్పుకొచ్చాడు.

'ఐపీఎల్ 2026 సీజన్‌లో విరాట్ కోహ్లీ నుంచి అత్యుత్తమ ఆట ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఫిట్‌నెస్ అతనికి ఎప్పుడూ సమస్య కాదు. శారీరక దృఢత్వం, బంతిని ఎదుర్కోవడం విషయంలో గానీ, ఫీల్డింగ్‌లో నెమ్మదించడం వంటి ఇబ్బందులు అతనికి ఏ మాత్రం రావు. కేవలం అతని మానసిక స్థితి మాత్రమే అతన్ని వెనక్కి తగ్గేలా చేయగలదు.విరాట్ కోహ్లీ తన కెరీర్ ముగింపు దశలో ఉన్నాడని నేను భావించడం లేదు. అతనిలో మరో 5 నుంచి 6 ఏళ్లు నాణ్యమైన క్రికెట్ ఆడగల సత్తా ఉందని నేను భావిస్తున్నా.

కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని నేను కోరుకుంటన్నా. అది కూడా కెప్టెన్‌గా పునరాగమనం చేయాలని ఆశిస్తున్నా. భారత క్రికెట్‌లో నేను చూసిన అత్యుత్తమ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం అతను బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే.. అతను ఆడకపోవడం భారత క్రికెట్‌కు తీరని లోటు. కోహ్లీకి టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ ఇస్తే గొప్ప ప్రేరణగా నిలుస్తుంది. డబ్ల్యూటీసీ గెలవడం అతనికి ఒక గొప్ప సవాల్ అవుతుందని నేను భావిస్తున్నా. అతను చాలా ఫిట్‌గా ఉన్నాడు. కాబట్టి అతనికి ఫిట్‌నెస్ సమస్య కాదు.'అని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన విజయాలను సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడంతో పాటు డబ్ల్యూటీసీ 2021 ఎడిషన్‌లో ఫైనల్ చేరింది. మరోవైపు మానసికంగా అలసిపోవడంతోనే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌తో పాటు టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికానని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. సన్‌రైజర్స్‌తో విజయానంతరం మాట్లాడుతూ.. ఒకే ఫార్మాట్ ఆడటం వల్ల తనకు తగిన విశ్రాంతి లభిస్తుందని, దాంతో తాజాగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నానని చెప్పుకొచ్చాడు. తద్వారా తన ఆట కూడా ఎంతో మెరుగైందని చెప్పాడు.
