రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసిన ఆర్‌సీబీ.. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అప్పటి నుంచి ఆర్‌సీబీపై రాయుడు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు.
అవసరం లేకపోయినా.. కోహ్లీ, ఆర్‌సీబీ టీమ్ పెర్ఫామెన్స్‌ను ప్రస్తావిస్తూ.. తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయాన్ని ప్రశంసిస్తూనే.. ఆర్‌సీబీ, విరాట్ కోహ్లీపై రాయుడు విమర్శలు గుప్పించాడు.

ఆరెంజ్ క్యాప్‌లతో టైటిల్ రాదు..
ఆరెంజ్ క్యాప్‌లతో టైటిల్ గెలవలేమని, సమష్టి ప్రదర్శనలే ఛాంపియన్‌గా నిలబెడుతాయని చెబుతూ.. ఈ సీజన్‌లో కోహ్లీ ప్రదర్శనను తక్కువ చేస్తూ మాట్లాడాడు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ 15 మ్యాచ్‌ల్లో 741 రన్స్ చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం ఉంది.
ఈ ప్రదర్శనతో విరాట్ కోహ్లీ ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ కారణంగానే ఆర్‌సీబీ టైటిల్ గెలవలేకపోయిందని రాయుడు అభిప్రాయపడ్డాడు. ఫైనల్ అనంతరం మాథ్యూ హెడెన్, కెవిన్ పీటర్సన్, హోస్ట్ మయాంతి లాంగర్‌తో మాట్లాడిన రాయుడు.. కోహ్లీపై తనకున్న విద్వేషాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు.
కోహ్లీ తక్కువ పరుగులు చేయాలి..
'టైటిల్ గెలిచిన కేకేఆర్‌కు అభినందనలు. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఆ జట్టు అండగా నిలిచింది.
జట్టు విజయంలో వారు తమ వంతు పాత్ర పోషించేలా ప్రోత్సహించింది. సమష్టి ప్రదర్శనతో టైటిల్ గెలవచ్చని కేకేఆర్ మరోసారి చాటి చెప్పింది. ఏళ్ల తరబడి మనం చూస్తుందే ఇదే.
ఆరెంజ్ క్యాప్‌లతో టైటిల్ గెలవలేం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 300 ప్లస్ రన్స్‌తో రాణిస్తేనే జట్టు విజయం సాధ్యమవుతోంది. ఆర్‌సీబీకి ప్రధాన సమస్య విరాట్ కోహ్లీనే. లీగ్‌లో అతను నెలకొల్పిన ప్రమాణాలు జట్టులోని కుర్రాళ్లను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఆర్‌సీబీలో కోహ్లీ ఓ దిగ్గజం. అతను ప్రతీ సీజన్‌లోనూ అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పుతున్నాడు.
అయితే అతని కారణంగా జట్టులోని కుర్రాళ్లంతా ఒత్తిడికి గురువుతున్నారు. కాబట్టి కుర్రాళ్లు స్వేచ్చగా ఆడేలా కోహ్లీ తన ప్రమాణాలు కాస్త తగ్గించుకోవాలి. అప్పుడే కుర్రాళ్లు ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగలరు.'అని రాయుడు చెప్పుకొచ్చాడు.
తప్పుబట్టిన పీటర్సన్..
అయితే ఈ వ్యాఖ్యలతో కెవిన్ పీటర్సన్, మాథ్యూ హెడెన్, మయాంతి లాంగర్ ఏకీభవించలేదు. కోహ్లీ నెలకొల్పిన అత్యుత్తమ ప్రమాణాలు కుర్రాళ్లకు మేలు చేసేవేనని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ఇక కోహ్లీ కారణంగానే రజత్ పటీదార్ లాంటి ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని మయాంత్ లాంగర్ పేర్కొంది.
అయితే రజత్ పటీదార్ రాణించినా.. అతను కోహ్లీ కాదని, ఆర్‌సీబీ తమ జట్టులో 11 మంది కోహ్లీలను తీసుకురాలేదని రాయుడు సమాధానమిచ్చాడు.
అయితే రాయుడు వ్యాఖ్యలపై ఆర్‌సీబీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ బ్యాటర్‌ను అత్యుత్తమ ప్రదర్శన చేయవద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. చెన్నైని ఓడించామనే బాధతో ఆర్‌సీబీపై రాయుడు కుక్కలా మొరుగుతున్నాడని మండిపడుతున్నారు.