న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు పొలిటికల్ పిచ్‌పై తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలెట్టేసారు. రాజకీయాలను, ప్రజల పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కాస్త టైమ్ కావాలన్న రాయుడు.. నెల రోజుల పర్యటనతోనే ప్రత్యర్థులపై పంచ్‌లు విసరడం మొదలుపెట్టారు.
పొలిటికల్ బౌన్సర్లు ఎదుర్కోకముందే.. స్టెప్ ఔటై ప్రత్యర్థులపై సిక్సర్లు బాదే ప్రయత్నం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనే రాయుడు తన పొలిటికల్ విమర్శలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వాలాంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాయుడు ఘాటుగా స్పందించారు.

ప్రస్తుతం గుంటూరు పర్యటనలో ఉన్న అంబటి రాయుడు.. ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, అక్కడ విద్యార్థులకు అందుతున్న వసతుల్ని పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు. ఏపీ వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాలంటీర్ వ్యవస్థ.. దేశానికే ఆదర్శమని చెప్పిన రాయుడు.. మంచి చేస్తుంటే బురదజల్లే వారు ఎక్కడైనా ఉంటారని, వారిని అస్సలు పట్టించుకోకూడదని వాలంటీర్‌లకు సూచించారు.
'ఏపీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంచి జరుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకే అందుతున్నాయి. అవ్వా తాతలకు నేరుగా ఇంటికి వెళ్లి పెన్షన్‌లు అందిస్తున్నారు. ఇంత గొప్ప వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదు. కరోనా వంటి విపత్కర సమయంలో వాలంటీర్‌లు ఎంత కష్టపడ్డారో ఈ ప్రపంచం మొత్తం చూసింది.
ప్రాణాలకు తెగించి మరీ వాలంటీర్స్ సేవలను అందించారు. అలాంటి వ్యవస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి పని చేస్తుంటే బురదజల్లేవారు ఎక్కడైనా ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వాళ్లు విమర్శించారని మనం ఆగిపోకూడదు.. మరింత ధైర్యంగా వాలంటీర్ వ్యవస్థ ముందుకు వెళ్తుంది.'అని అంబటి రాయుడు ఘాటుగా కౌంటరిచ్చారు.

ఇక ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్‌తో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు.. అమెరికా మేజర్ లీగ్‌లో ఆడాలనుకున్నారు. కానీ పొలిటికల్ కెరీర్ కోసం ఆ లీగ్‌ను కూడా వదిలేసే ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగానే ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని కొనియాడిన రాయుడు.. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు పరోక్షంగా సూచనలిచ్చారు.
ప్రముఖ తెలుగు చానెల్‌కు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చిన రాయుడు రాజకీయాలను అర్థం చేసుకోవడానికి కాస్త టైమ్ కావాలన్నారు. సమయం వచ్చినప్పుడు తానే అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు రావాలనుకుంటున్నానని వెల్లడించారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న రాయుడు.. మీడియాకు కూడా దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ తరఫున రాయుడు గుంటూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.